కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ రాజధానిని తరలిస్తారా.. లేక అమరావతిలోనే కొనసాగిస్తారా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. సీఎం జగన్‌ సీఆర్‌డీఏ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల పాటు సీఆర్‌డీఏపై సీఎం జగన్‌ నిర్వహించిన సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.

సీఆర్‌డీఏ సమీక్ష అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజధాని పరిధిలో 35వేల కోట్లతో చేస్తున్న పనులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఎలాంటి ఒప్పందాలూ లేవన్నారు. ఆర్థిక పరిస్థితుల ఆధారంగా నిర్మాణాలపై ముందుకెళతామని ఆయన అన్నారు. భూసమీకరణకు సంబంధించి మొత్తం 64 వేల మంది రైతులు భూములు ఇచ్చారన్నారు. 43 వేల మంది రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ జరిగిందని, మిగతా స్థలాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉందని తెలిపారు. రైతులకు కౌలు బకాయిలు ఇస్తున్నామన్నారు. శుక్రవారం నుంచి కౌలు చెల్లింపులు జరపనున్నామని వివరించారు.

రాజధాని 5 కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందినది కాదని మరోసారి వ్యాఖ్యానించారు మంత్రి బొత్స. రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇంకా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. సమీక్షలో రాజధాని అంశంపై వాస్తవాలు పరిశీలించామని తెలిపారు. ముంపు సమస్య చర్చకు రాలేదన్నారు. రాజధాని విషయంలో ఎవరికీ అనుమానల్లేవని పేర్కొన్నారు. రాజధాని గురించి ఎవరో ఏదో చెబితే తనకేంటి సంబంధం అని ఎదురు ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితులు చూసి ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని బొత్స వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోందన్న బొత్స.. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదన్నారు.

అమరావతిలో భూములిచ్చిన రైతులకు.. కొన్ని రోజులుగా నిలిచిపోయిన కౌలును రెండు రోజుల్లో పంపిణీ చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. రాజధానిపై సీఆర్డీఏ అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అమరావతి రాజధాని నిర్మాణాలకు సంబంధించి బ్యాంక్, ఆర్థిక ఒప్పందాలను పరిశీలించారని, లక్ష్యాలను ఎలా చేరుకోవాలనే అంశంపై చర్చించారని మంత్రి బొత్స తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story