జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఆంక్షలు

జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఆంక్షలు

జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఆంక్షలు విధించారు. కశ్మీర్‌ లోయలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. ప్రజా రవాణా, మార్కెట్లు మూత పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఫోన్‌ సర్వీసులపై ఆంక్షలు సడలించినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూ ఉన్నాయి. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి కశ్మీర్‌లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మధ్యమధ్యలో పరిస్థితులను బట్టి నిషేధాజ్ఞలను సడలిస్తున్నారు. జమ్మూ, శ్రీనగర్, లఢాఖ్‌లలో ఆంక్షలు తొలగించారు.

కశ్మీర్‌లో పరిస్థితులపై పుకార్లు వ్యాప్తి చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా కఠినచర్యలు తీసుకుంటామని జమ్మూకశ్మీర్ పోలీసులు హెచ్చరించారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఐదుగురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. తప్పుడు పోస్టులతో ప్రజలను రెచ్చగొట్టినందుకు గాను ఐదుగురిపై కేసు నమోదు చేశామని చెప్పారు. కశ్మీ ర్ మీడియా కేంద్రం కూడా, పుకార్లు-వదంతులతో అల్లర్లను ప్రేరేపిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది.

మరోవైపు, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. లోయలో శాంతిభద్రతలు, రక్షణపరమైన చర్యలపై ఆర్మీ చీఫ్ సమీక్ష చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆర్మీ చీఫ్ తొలిసారి కశ్మీర్‌కు వెళ్లారు. దాయాది పాకిస్తాన్‌ కయ్యానికి కాలుదువ్వుతున్న వేళ కశ్మీర్‌లో భద్రతా బలగాల సన్నద్ధతను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌లు జమ్మూకశ్మీర్‌-లఢాఖ్‌లలో పర్యటించారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ వెళ్లారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ బలగాలు పదే పదే కాల్పులకు తెగబడుతున్న వేళ, ఆర్మీ చీఫ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story