కనుమరుగు కానున్న ఆంధ్రాబ్యాంక్

కనుమరుగు కానున్న ఆంధ్రాబ్యాంక్

ఆంధ్రా బ్యాంక్.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ బ్యాంక్‌ గురించి పరిచయం అవసరం లేదు. పట్టణాలతో పాటు గ్రామాలలోనూ బ్యాంకింగ్ సేవలు అందించడంలో.. ఆంధ్రా బ్యాంక్‌కు ఎంతో చరిత్ర ఉంది. 96 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ బ్యాంక్.. ఇప్పుడు కనుమరుగు కానుంది. కేంద్రం చేపట్టిన ఆర్థిక సంస్కరణలలో బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా.. ఆంధ్రా బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్నట్లు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ ఊపందుకుంది. ఇందులో భాగంగా... యూనియన్ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లను విలీనం చేయనున్నారు. మరో మూడు విలీన ప్రక్రియలపై కూడా కేంద్రం వెల్లడించినా... తెలుగు రాష్ట్రాల ప్రజలలో ఆంధ్రా బ్యాంక్ విలీనం చర్చగా మారింది. మన దేశంలో అత్యంత పురాతనమైన బ్యాంకులలో ఆంధ్రా బ్యాంక్ కూడా ఒకటి. 1923, నవంబరు 20న ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య.. వాణిజ్య బ్యాంకుగా ఆంధ్రా బ్యాంక్‌ను మచిలీపట్నంలో స్థాపించారు. అప్పటి నుంచి బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అందించడంలో.. తనదైన గుర్తింపును ఆంధ్రా బ్యాంక్ సాధించింది. బ్యాంకుల కన్సాలిడేషన్ ప్రక్రియలో భాగంగా 1964లో భారత్ లక్ష్మి బ్యాంక్‌‌ను.. ఆంధ్రా బ్యాంక్‌లో విలీనం చేశారు.

బ్యాంకుల జాతీయకరణలో భాగంగా 1980లో ఆంధ్రా బ్యాంక్‌ను చేశారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా ఈ బ్యాంక్ అవతరించింది. 1981లో క్రెడిట్ కార్డ్‌లను పరిచయం చేయుటం ద్వారా భారత దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను పరిచయం చేసిన ఘనత ఆంధ్రా బ్యాంకుదే. 2003 నాటికి వంద శాతం కంప్యూటరీకరణ సాధించిన రికార్డ్ కూడా ఉంది. 2007లో బయోమెట్రిక్ ఏటిఎంలను భారతదేశానికి పరిచయం చేసింది ఆంధ్రా బ్యాంక్. ఈ బ్యాంక్ మొత్తం కార్యకలాపాలలో... దాదాపు మూడో వంతు గ్రామీణ ప్రాంతాల నుంచి సేవలు అందించడం... ఈ బ్యాంక్ ప్రత్యేకతగా చెప్పుకోవాలి.

22 రాష్ట్రాలలో, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆంధ్రా బ్యాంక్ విస్తరించింది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 1.37 కోట్ల ఖాతాదారులు ఉన్నారు. ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు... ఈ బ్యాంక్ అందించే మొత్తం రుణాలలోకనీసం 50 శాతానికి తగ్గకుండా లోన్స్‌ను గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఇస్తున్న బ్యాంక్.. ఆంధ్రా బ్యాంక్. దేశంలో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో దీనిని ప్రధానమైనదిగా చెబుతారు.

ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా బ్యాంక్.. ఇప్పుడు పూర్తిగా కనుమరుగు కానుంది. యూనియన్ బ్యాంక్‌లో విలీనం చేయనుండడంతో.. ఇకపై ఆంధ్రా బ్యాంక్ అనే పేరు మటుమాయం కానుంది. ఓ తెలుగు వ్యక్తి ప్రారంభించి.. అత్యధికంగా తెలుగు రాష్ట్రాలలో సేవలు అందించి... ఎన్నో రకాల కొత్త సర్వీసులను దేశీయ బ్యాంకింగ్ రంగానికి పరిచయం చేసిన ఆంధ్రా బ్యాంక్... త్వరలోనే బ్యాంకింగ్ సంస్కరణలలో భాగంగా మటుమాయం కానుంది. అయితే... గత కొంత కాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు కారణంగా... ఇది సరైన చర్యేననే అభిప్రాయాలు వెల్లడి అవుతున్నాయి. ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా ఆంధ్రా బ్యాంక్ ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కుంటోంది. వీటిలో ఎన్‌పీఏలు కూడా ముఖ్యమైనవి. బ్యాంకుల విలీనం తర్వాత ఖర్చులు తగ్గి.. లాభదాయకత పెరిగే అవకాశం ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story