Top

అందువల్లే ఏపీ ఎకానమీ కుదేలైంది : చంద్రబాబు

అందువల్లే ఏపీ ఎకానమీ కుదేలైంది : చంద్రబాబు
X

టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు ఇసుక కొరతను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. సిమెంట్‌ కన్నా ఇసుక ధర పెరిగిపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. 20 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికుల పొట్ట కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు సంఘీభావంగా టీడీపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇసుక కొరత వల్లే ఏపీ ఎకానమీ కుదేలైందని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి ఉంటేనే ఏ రాష్ట్రానికైనా ఆదాయం వస్తుందన్నారు. అభివృద్ధికి గండి కొట్టినందునే..రాష్ట్రంలో రాబడి తగ్గిపోయిందని అన్నారు. 14 శాతం ఉన్న రాష్ట్ర వృద్ధి రేటు మూడో వంతుకు పడిపోయి.. 8 శాతానికి చేరే అవకాశం ఉందన్నారు. పీపీఏలను ఏకపక్షంగా రద్దు చేయడం.. పరిశ్రమలపై విచారణ.. ఇసుక కొరత సృష్టించడం.. లక్షలాది కార్మికులకు ఉపాధి దూరం చేయడం వంటి పరిణామాల దృష్ట్యా ఆందోళనలకు దిగుతున్నామని చెప్పారు. ఈ మేరకు చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మంగళగిరిలో ధర్నా చేపట్టనుండగా.. మిగతా నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు.

ఫ్రాన్స్, జపాన్‌ తదితర దేశాల నుంచి రాష్ట్రానికి హెచ్చరికలు రావడాన్ని ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు ప్రస్తావించారు. మూడు నెలల్లో రాష్ట్రానికి చెడ్డపేరు రావడంతో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదని ఆక్షేపించారు. జీవనాడిలాంటి పోలవరాన్ని నిలిపివేయడం.. ప్రాణానాడిలాంటి అమరావతిని ఆపివేయడం..ఇసుక కొరతతో నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రేషన్‌ కార్డుల్ని తొలగించడం.. అన్న క్యాంటీన్లను మూసివేయడం.. రంజాన్‌ తోఫా ఇవ్వకుండా ఎగ్గొట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.

అటు.. వచ్చేనెల మొదటి వారం నుంచి జిల్లాల పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. సెప్టెంబర్‌ 5, 6 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత ప్రతి వారం 2 రోజులు జిల్లా పర్యటనలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోనే అధినేత మకాం వేసి.. నేతలు, కార్యకర్తలను స్వయంగా కలవనున్నారు. జిల్లా పార్టీ జనరల్‌ బాడీ సమావేశంతో పాటు.. ప్రజాప్రతినిధులు, ఇన్‌ఛార్జ్‌లు, సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశాలు చేపడతారు. జిల్లాల్లో అనుబంధ సంఘాలను బలోపేతం చేయడంతో పాటు.. సామాజిక న్యాయంతో పార్టీ పటిష్టం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన.

మరోవైపు.. వైసీపీ వేధింపులకు నిరసనగా సెప్టెంబర్‌ 3 నుంచి గుంటూరులో బాధితుల పునరాశ్రయ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. పల్నాడు సహా ఇతర ప్రాంతాల బాధితులకు ఆశ్రయం కల్పిస్తామని తెలిపారు. గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా బాధితులు శిబిరంలోనే ఉంటారని.. తానే దగ్గరుండి బాధితులను ఆయా గ్రామాలకు తోడ్కొని వెళ్తానన్నారు.

Next Story

RELATED STORIES