ఫేస్‌బుక్‌ లో పరిచయం ఎంతకి దారితీసిందంటే..

ఫేస్‌బుక్‌ లో పరిచయం ఎంతకి దారితీసిందంటే..

ఫేస్‌ బుక్‌లో కపట ప్రేమ.. మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫేస్‌బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తితో చేసిన చాటింగ్‌ ముదిరి.. ఓ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. పాలమూరు జిల్లా జడ్చర్ల శివారులో ఈ దారుణం జరిగింది. ఈ నెల 27న శ్రీహర్షిణి అనే అమ్మాయి అదృశ్యమవడంతో తండ్రి రవిశంకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు... ఆ తర్వాత శ్రీహర్షిణి ఫేస్‌ బుక్‌ ఐడీతో హయత్‌నగర్‌ ‌ కోహెడకు చెందిన నవీన్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. శ్రీహర్షిణిని తానే చంపినట్లు అంగీకరించాడు.

జడ్చర్లలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో ఉంటున్న రవిశంకర్‌, సురేఖ దంపతుల కూతురు శ్రీహర్షిణి. మహబూబ్‌నగర్‌లో కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. తండ్రి రవిశంకర్‌ జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే శ్రీహర్షిణి గత మూడు నెలలుగా నవీన్‌ రెడ్డితో ఫేస్‌ బుక్‌లో స్నేహం చేస్తోంది. వీరి స్నేహం మరింత ముదిరి వాట్సప్‌‌లో చాటింగ్‌ చేసుకునే స్థాయికి చేరింది. ఇద్దరి మధ్య చనువు ఏర్పడటంతో ఈ నెల 27న నవీన్‌రెడ్డి జడ్చర్లకు వచ్చి శ్రీహర్షిణిని కలిశాడు. కారులో ఆమెను శంకరాయపల్లి తండా వైపు తీసుకెళ్లాడు. అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత శారీరకంగా కలవాలని శ్రీహర్షిణిపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి శ్రీహర్షిణి అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన నవీన్‌రెడ్డి ఆమెను బండరాయితో మోది చంపేశాడు.

ఈ హత్య జరిగిన రెండు రోజుల తర్వాత నవీన్‌రెడ్డిని అదుపులో తీసుకోవడంతో అసలు విషయం బయటికి వచ్చింది. కూతురు దారుణ హత్యకు గురి కావడంతో కన్నీరుమున్నీరవుతున్నారు తల్లిదండ్రులు. ఆ రాక్షసుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియా పరిచయాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. శ్రీహర్షిణి హత్యకు కారణమైన నవీన్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story