భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రి

భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ మంత్రి

ఆర్టికల్‌ 370 రద్దుతో రగిలిపోతున్న పాకిస్థాన్, భారత్‌ను రెచ్చగొట్టే చర్యల్ని కొనసాగిస్తోంది. సెప్టెంబర్, లేదా అక్టోబర్ లో యుద్ధం వస్తుందని పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ అతిభీకర యుద్ధమే చివరిది అవుతుందని అన్నారు.

తాజాగా మరో అడుగు ముందుకేసిన పాక్‌..బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది. ఆ వీడియోను పాకిస్తాన్‌కు చెందిన ఆర్మీ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఇతర అధికారులు శుభాకాంక్షలు తెలిపినట్లు అందులో పేర్కొన్నారు.

పాకిస్థాన్‌ బుధవారం రాత్రి ఘజ్నవి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది. పలురకాల వార్‌ హెడ్లను మోసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఈ బాలిస్టిక్‌ క్షిపణికి ఉన్నాయి.

అటు పాకిస్థాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది భారత్. క్షిపణి ప్రయోగాలతో భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఉరుకోబమని వార్నింగ్ ఇచ్చారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.

అటు భారత విదేశాంగ శాఖ కూడా పాక్‌తీరుని తీవ్రంగా తప్పుపట్టింది. కశ్మీర్‌పై తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని చురకలంటించింది. దేశంపైకి ఉగ్రవాదులను ఉసిగొల్పడం మానుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఇకపై పాకిస్థాన్‌ ఒక సాధారణ పొరుగు దేశంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని హితవు పలికారు. ఉగ్రవాదులను భారత్‌లోకి ఎగదోసే పని మానుకోవాలని హెచ్చరించారు.

పాకిస్తాన్ కపట బుద్ధులపై భారత్ అలర్ట్ అయ్యింది. గుజరాత్‌లో హింస సృష్టించేందుకు పాక్‌ ఉగ్రవాదులు భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించే అవకాశాన్ని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. గుజరాత్‌లో హై అలర్ట్‌ ప్రకటించారని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story