మూడు దశల్లో ఆ గ్రిడ్‌ను పూర్తి చేయాలి : సీఎం జగన్‌

మూడు దశల్లో ఆ గ్రిడ్‌ను పూర్తి చేయాలి : సీఎం జగన్‌

మూడు దశల్లో వాటర్‌ గ్రిడ్‌ను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం జగన్‌. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఇంటింటికీ తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో తాగునీటి సరఫరాపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్‌ అధికారులు, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. వాటర్‌ గ్రిడ్‌ పథకం తొలిదశలో శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. రెండో దశలో విజయనగరం, విశాఖతోపాటు రాయలసీమలోని నాలుగు జిల్లాలు.. మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు తాగునీరు ఇవ్వాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.

నీటిని తీసుకున్న చోటే ఫిల్టర్‌ చేసి సరఫరా చేసే విధానంపై అధ్యయనం చేసి ప్రణాళిక ఖరారు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. చెరువులు, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల్లో తాగునీరు నింపిన తర్వాత కలుషితం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయాలని సూచించారు. కిడ్నీ బాధిత ప్రాంతాల్లో ట్రీట్‌మెంట్ ‌ప్లాంట్‌ నుంచి నేరుగా ఇళ్లకే తాగునీటిని పంపిణీచేయాలని సీఎం ఆదేశించారు.

అటు విడతల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్‌.. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపామని అన్నారు.. ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోందని చెప్పారు. అక్టోబరు నుంచి 20 శాతం మద్యం దుకాణాలతోపాటు బార్ల సంఖ్యనూ తగ్గిస్తామని స్పష్టం చేశారు. అక్రమ మద్యాన్ని, నాటుసారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story