ఏపీలో చిన్నారులే టార్గెట్‌.. కిడ్నాప్‌ చేసి..

ఏపీలో చిన్నారులే టార్గెట్‌.. కిడ్నాప్‌ చేసి..

ఏపీలో చిన్నారులే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోతున్నారు. అభంశుభం తెలియని పసిపిల్లలను ఎత్తుకెళుతున్నారు. మొన్నటి రాజమండ్రి బాలుడి కిడ్నాప్‌ ఘటన మరవకముందే..మరికొన్ని చోటు చేసుకున్నాయి. కొన్ని కిడ్నాప్‌ కేసులు సుఖాంతంగా ముగిస్తే...కొన్నిమాత్రం విషాదాంతం అవుతున్నాయి. తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. డబ్సు కోసం కొన్ని అయితే..వ్యక్తిగత కక్షలకు చిన్నారులను బలి తీసుకుంటున్నారు. వరుస కిడ్నాప్‌ కేసులు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారగా.. ప్రజలు మాత్రం భయభ్రాంతులకు గురి అవుతున్నారు.

గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గురజాలలో ఈనెల 25న అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడు సుభాష్‌ దారుణహత్యకు గురయ్యాడు. ఇంటి సమీపంలోని ముళ్ల పొదల్లో మృతదేహాన్ని గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అల్లారుముద్దుగా చూసుకున్న కుమారుడు ఇప్పుడు విగతజీవిగా మారడం వారిని విషాదంలో ముంచేసింది. కిడ్నాపైన 5రోజుల వరకూ పోలీసులు కేసును చేధించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసి హంతకుల కోసం దర్యాప్తు మొదలుపెట్టారు.

తిరుపతి నగరంలోని భూమా థీయెటర్‌ వద్ద మూడేళ్ల చిన్నారిని కొందరు ఆగంతకులు కిడ్నాప్‌ చేశారు. అయితే.. తిరుపతి అర్బన్‌ జిల్లా పోలీసులు 5 గంటల్లోనే చిన్నారి కిడ్నాప్‌ కేసును ఛేదించారు. కిడ్నాపర్ల చెర నుంచి చిన్నారి భాగేశ్వరిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. తమ బిడ్డ సురక్షితంగా ఇంటికి చేరడంతో చిన్నారి తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. తమ బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీలో చిన్నారుల వరుస కిడ్నాప్‌ ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కిరాతకులు ఎప్పుడు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడతారోనని ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story