ఈ బ్యూటీ క్వీన్‌ వయసు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఈ బ్యూటీ  క్వీన్‌  వయసు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

క్వీన్‌ రానియా.. చాలామందికి ఈ పేరు తెలియకపోవచ్చు. ఆమె దేశానికి రాణి అయినా కూడా నిరాడంబర జీవితాన్ని గడుపుతోంది. శరణార్థుల బాగోగులను పట్టించుకుంటూ సామాజిక సేవకురాలిగా విద్య, స్త్రీ సాధికారత పెంపొందేలా సేవలను అందిస్తోంది. క్వీన్‌ రానియా దేశవిదేశాల్లో తన ప్రసంగాలతో అందరికీ అవగాహన కల్పిస్తూ మార్పు సాధించాలనే ధృఢసంకల్పంతో ముందుకు వెళ్తోంది. మధ్య ఆసియా దేశాల్లో బతుకు విచ్ఛిన్నమై శరణార్ధులుగా మారుతున్న ప్రజల జీవితంలో మళ్ళీ వెలుగులు నింపేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.

"ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ పరిణామాల కారణంగా చాలా మంది ప్రజలు మానసికంగా,శారీరకంగా కుంగిపోతున్నారు. అలాంటి వారి పట్ల చిన్న చూపు చూస్తే వాళ్లు ఉగ్రవాదులుగా మారే అవకాశం ఉంది. కావునా వారిని గౌరవంగా చూస్తూ ఒక దారి చూపిస్తే బాధ్యత గల పౌరులుగా బతుకుతారు’’ అని అనేక ప్రసంగాల్లో క్వీన్‌ రానియా చెబుతుంటారు. ఆమె రచయిత్రి కూడా కావడంతో పిల్లల మానసిక వికాసంపై అనేక పుస్తకాలు రాశారు. వాటిలో ది కింగ్స్‌ గిఫ్ట్, ఎటర్నల్‌ బ్యూటీ, మహా ఆఫ్‌ ది మౌంటైన్స్, ది శాండ్విచ్‌ స్వాప్‌ పుస్తకాలు ప్రసిద్ది చెందాయి. చూడడానికి ఇరవై ఏళ్ళ యువతిలా కనిపించే క్వీన్‌ రానియా నేటితో నలభై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఓప్రా విన్‌ఫ్రే కూడా ఆమె అందంపై ప్రశ్నిస్తూ మీ బ్యూటీ సీక్రెట్‌ ఏంటి?’ అంటూ అడిగారు దానికి ఆమె నవ్వుతూ ‘చాక్లెట్‌’ అని సమాధానమిచ్చారు.

క్వీన్‌ రానియా జోర్డాన్‌ రాజు అల్‌ అబ్దుల్లా బిన్‌ అల్‌–హుస్సేన్‌ భార్య. పాలస్తీనాకు చెందిన ఆమె అమెరికన్‌ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయ్యారు. సిటీబ్యాంక్‌ ,ఆపిల్ సంస్థలో పనిచేశారు. ఆపిల్‌లో పనిచేస్తున్న సమయంలో రానియా ఒక విందులో జోర్డాన్‌ యువరాజు అల్‌ అబ్దుల్లాను కలుసుకున్నారు. ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత 1993లో వివాహం చేసుకున్నారు. రానియా క్వీన్‌ హోదాలో ఉంటూ కూడా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ప్రపంచ విద్యకు, సమాజ సాధికారతకు కృషి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story