శభాష్ రాజా.. యూనిఫామ్ కోసం కోర్టుకు వెళ్లి.. కేసు గెలిచి

శభాష్ రాజా.. యూనిఫామ్ కోసం కోర్టుకు వెళ్లి.. కేసు గెలిచి
X

వ్యవస్థలో లోపాల్ని ఎత్తి చూపుతాం.. వీలైతే నలుగురితో పంచుకుని ఇలా వుంటే బావుంటుంది.. అలా వుంటే బావుంటుందని మనలో మనం తర్కించుకుంటాం. ప్రశ్నించే హక్కున్నా నా కెందుకులే.. నలుగురూ నడిచే దారిలోనే వెళితే పోలా అని అనుకుని వెనకడుకు వేస్తాం. అవకాశం వచ్చినా అడగడానికి బిడియపడతాం. అలాంటిది నిండా పదేళ్లు కూడా లేని ఓ చిన్నారి అధికారుల తీరుని ఎండగడుతూ కోర్టుకి వెళ్లాడు. కర్ణాటక రాష్ట్రం కిన్నాళ్ల గ్రామానికి చెందిన మంజునాథ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. అతడికి ఉన్న ఒక్కగానొక్క యూనిఫాం మాసిపోయింది. పాతది వేసుకుందామని చూస్తే అది కాస్తా చినిగిపోయి ఉంది.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్‌లు ఇవ్వాలని రూల్ ఉన్నా ఒక్క డ్రెస్సే ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు అధికారులు. దీంతో వేసుకోవడానికి యూనిఫామ్ లేదు ఎలా వెళ్లాలి స్కూల్‌కి అని ఆలోచించాడు. చిట్టిబుర్రకి ఓ ఐడియా వచ్చింది. నాన్నతో పంచుకున్నాడు. హైకోర్టుకు వెళ్లి ఈ ఏడాది మార్చి 25న రిట్ పిటిషన్ వేశాడు. దీనిపై విచారణ చేపట్టడానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ మహ్మద్ నవాజ్‌తో కూడిన డివిజన్ బెంచ్ అంగీకరించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం అధికారుల జాప్యంపై మండిపడింది. రెండునెలల్లోగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ యూనిఫామ్‌తో పాటు షూ, సాక్సులు పంపిణీ చేయాలని ఆదేశించింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు మంజునాథ్ ఎంతో సంతోషించాడు. తనతో పాటు తన స్నేహితులందరికీ రెండు జతల బట్టలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశాడు.

Next Story

RELATED STORIES