తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి సందడి

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. పర్యావరణంపై ఈసారి ప్రజల్లో కాస్త అవగాహన పెరిగినట్టే కనిపిస్తోంది. చాలా చోట్ల మట్టి విగ్రహాలకే జనం ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే గణేష్ మండపాల్లో చాలా చోట్ల ఇంకా POP విగ్రహాలనే ఏర్పాటు చేస్తున్నారు. మట్టి ప్రతిమలనే పూజించేలా మరింతగా ప్రచారం చేపట్టాలని పర్యావరణవేత్తలు అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాలుగు వేల మట్టి మహా గణపతి విగ్రహాలను,గరికను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హైదరాబాద్ బండ్లగూడలోని ఆనంది ఎన్‌క్లేవ్ కాలనీలో ఉచితంగా మట్టిగణపతులను పంపిణీ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలు ముందుకు రావాలని తలసాని పిలుపునిచ్చారు. అనంతపూర్ జిల్లాలో కూడా వినాయక చవితి సందడి నెలకొంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో కొందరు పర్యావరణ ప్రేమికులు మట్టి గణపతుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. POP విగ్రహాల వల్ల నష్టాన్ని ప్రజలకువివరించారు
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్థానిక DDM యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. గత ఏడేళ్లుగా యువత చేస్తున్న కృషిని స్థానికులు అభినందిస్తున్నారు. POP వినాయక విగ్రహాలను నిషేధించి మట్టి విగ్రహాలనే పూజించాలన్నారు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్. నగరంలోని పెవిలియన్ మైదానంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 6 వేల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com