13 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున హ్యాట్రిక్‌

13 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున హ్యాట్రిక్‌

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుపై భారత్‌ పట్టు బిగుస్తోంది . ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌ రెండో రోజు ఆటలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ హనుమ విహారి శతకంతో చెలరేగాడు. 111పరుగులు చేయడంతో భారత్‌ మెరుగైన స్కోర్‌ చేయగలిగింది. విహారితో పాటు..ఇషాంత్‌ శర్మ కూడా బ్యాట్‌ ఝులిపించాడు. 80బంతుల్లో 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో తొలిఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 416 పరుగుల వద్ద ఆలౌటైంది. రెండో రోజు ఆట ఆరంభం కాగానే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది..తొలి బంతికే పంత్‌ 27 పరుగుల వద్ద ఔట్‌ అయ్యాడు. తర్వాత వచ్చిన జడేజా16 పరుగులతో నిరాశపరిచాడు. చివరికి ఇషాంత్‌ తో కలిసి విహారి మ్యాచ్‌ను చక్కదిద్దాడు.

బౌలింగ్‌లోనూ భారత్‌ బౌలర్లు ఆధిక్యం కనబరిచారు. రెండో టెస్టులోనూ ఫాస్ట్‌బౌలర్‌ బుమ్రా రెచ్చిపోయాడు. హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు. ఆరంభం నుంచే పదునైన బంతులతో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టాడు. దీంతో ఏడో ఓవర్‌లోనే ఓపెనర్‌ క్యాంప్‌బెల్‌ను 2 పరుగుల వద్ద పెలివియన్‌ పంపాడు. డారెన్‌ బ్రావో4.. బ్రూక్స్‌ డకౌట్‌, చేజ్ డకౌట్‌తో హ్యాట్రిక్ సాధించాడు బుమ్రా.. 13 ఏళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున మరో హ్యాట్రిక్‌ నమోదైంది. ఓవరాల్‌గా బుమ్రా 6వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాడు. అతని ధాటికి రెండో ఆట ముగిసే సమయానికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. క్రీజులో కార్న్‌వాల్‌, హమిల్టన్‌ ఉన్నారు. ప్రస్తుతానికి భారత్‌ 329 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story