తెలంగాణ గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు

తెలంగాణ గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు

తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్ తమిళనాడుకు చెందినవారు. వృత్తిరీత్యా ఈమె డాక్టర్‌. తమిళిసై భర్త పేరు డాక్టర్‌ పి. సౌందర్‌ రాజన్‌. ఈయన సవీతా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్‌లో తమిళిసై సౌందరరాజన్ 1961 జూన్‌ 2 న జన్మించారు. ఈమె తండ్రి కుమారి ఆనంతన్‌ కాంగ్రెస్‌ మాజీ ఎంపీ. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీ నుంచి తమిళి సై MBBS చదివారు. MGR మెడికల్‌ యూనివర్సిటీ నుంచి ఒబ్సెటరిక్స్‌, గైనకాలజీలో పీజీ చేశారు.

రాజకీయాల్లోకి రాక ముందు ఈమె రామచంద్ర మెడికల్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అనేక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కన్‌సల్టెంట్‌ డాక్టర్‌గానూ సేవలందించారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో చదివే రోజుల్లోనే విద్యార్థి నేతగా రాజకీయాల్లో అడుగుపెట్టారు సౌందర్ రాజన్‌. కుటుంబమంతా కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసినప్పటికీ సౌందరరాజన్‌ బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. 1999లో దక్షిణ చెన్నై నుంచి బీజేపీ తరపున వివిధ హోదాల్లో పనిచేశారు. 2001లో బీజేపీ స్టేట్‌ మెడికల్‌ వింగ్‌కు సెక్రటరీగా చేశారు. 2010లో బీజేపీ స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 2013లో బీజేపీలో జాతీయస్థాయిలో పనిచేశారు. 2014 నుంచి తమిళి సై సౌందరరాజన్‌ తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.

అయితే ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ విజయం సాధించలేదు. రెండు సార్లు 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అటు పార్లమెంటు ఎన్నికల్లోనూ 2009, 2019 పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తమిళిసై సౌందరరాజన్‌ మహిళా హక్కుల కోసం మద్దతుగా తీవ్రంగానే పోరాడారు. మీ టూ ఉద్యమానికి కూడా మద్దతుగా నిలిచారు తమిళి సై సౌందరరాజన్‌.

Tags

Read MoreRead Less
Next Story