చంద్రయాన్-2లో మరో కీలకఘట్టం

చంద్రయాన్-2లో మరో కీలకఘట్టం

యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్‌-2 ప్రయాణం సాఫీగా సాగుతోంది. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సెప్టెంబర్‌ 7న ల్యాండర్‌ మూన్‌పై ల్యాండ్‌ కానుంది. మేక్‌ ఆర్‌ బ్రేక్‌ గా చెప్పిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో ముందుకు తీసుకెళ్తున్నారు. జులై 22న చంద్రయాన్-2 ప్రయోగం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని ప్రక్రియలను విజయవంతంగా పూర్తి చేశారు శాస్త్రవేత్తలు. మరో ఐదు రోజుల్లో ల్యాండర్ చంద్రుడిపై దిగనుంది. దీనికి ముందు అతి కీలకమైన ఘట్టం సోమవారం ఆవిష్కృతం కాబోతోంది.

ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్ -2ను జాబిల్లికి మరింత చేరువగా చేర్చారు. కక్ష్య కుదింపులో ఆఖరి ప్రక్రియను ఆదివారం చేపట్టారు. సాయంత్రం ఆరు గంటల 21 నిమిషాలకు ఈ విన్యాసాన్ని చేపట్టిన ఇస్రో 52 సెకన్లలో చంద్రయాన్-2ను చివరి కక్ష్యలోకి చేర్చింది. సోమవారం ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోతుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల నుంచి ఒంటి గంటా 45 నిమిషాల సమయంలో ప్రక్రియ నిర్వహించనున్నారు. కక్ష్య నుంచి ల్యాండర్ ను వేరు చేయటం కీలక విన్యాసమని ఇస్రో శాస్త్రవేతలు చెబుతున్నారు.

ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడదీసిన తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగేందుకు వీలుగా ల్యాండర్ విక్రమ్ కు రెండు డీ ఆర్బిటల్ విన్యాసాలను చేపడతారు. మంగళవారం మొదటి విన్యాసం, మరుసటి రోజున రెండో డీ ఆర్బిట్ విన్యాసం ఉంటుంది. ఇక సెప్టెంబర్ 7వ తేదీ వేకువజామున ఒంటి గంట 55 నిమిషాలకు చందమామపై ల్యాండర్‌ విక్రమ్ ల్యాండ్ అవుతుంది. 2 గంటల తర్వాత అందులోని ర్యాంప్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుంది. సోలార్ ప్యానెళ్లు తెరుచుకుంటాయి. సరిగ్గా 4 గంటలకు జాబిల్లి ఉపరితలంపై రోవర్‌ తన పని మొదలు పెడుతుంది.

చంద్రుడిపై ల్యాండర్‌ సేఫ్‌గా ల్యాండ్ అవగానే.. ల్యాండర్‌లోని ఆరుచక్రాల రోవర్‌ బయటకు వస్తుంది. ఇది సెకనుకు సెంటీమీటరు వేగంతో పయనిస్తుంది. 14 రోజుల్లో 500 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అక్కడ తీసిన డేటా మొత్తాన్ని ల్యాండర్‌ ద్వారా 15 నిమిషాల్లో భూమికి చేరవేయనుంది. రోవర్ పంపే ఫోటోస్‌, వీడియోలను విశ్లేషించడం ద్వారా చంద్రుడిపై వాతావరణం, ఖనిజ నిక్షేపాలు, నీటి నిల్వలపై ఓ అంచనాకు వస్తారు శాస్త్రవేత్తలు.

Tags

Read MoreRead Less
Next Story