చంద్రయాన్‌-2: కీలక దశ విజయవంతం

చంద్రయాన్‌-2: కీలక దశ విజయవంతం

ప్రపంచం యావత్ ఆసక్తిగా గమనిస్తున్న చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన లాండర్ విక్రమ్‌, రోవర్ ప్రజ్ఞాన్లు చందమామ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఒంటిగంట 10 నిమిషాలకు ఈ ప్రయాణం మొదలైనట్టు ఇస్రో ప్రకటించింది. అత్యంత కీలకమైన అంకంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో భారత్ చందమామకు మరింత చేరువు అయింది.

చంద్రయాన్ -2లో అత్యంత ప్రధానమైన అంకమిది. జులై 22న చంద్రుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆర్బిటర్.. ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అనంతరం దాని కక్ష్యను ఐదు సార్లు తగ్గించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఆర్బిటర్‌ను చంద్రుడికి మరింత దగ్గరగా తీసుకెళ్లారు. లాండర్ విడిపోవడంతో ఈ మొత్తం ప్రక్రియలోని కీలక ఘట్టం దిగ్విజయంగా పూర్తయింది.

సెప్టెంబర్ 7న అసలు ప్రయోగం మొదలవుతుంది. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న విక్రమ్..దాదాపు 15 నిమిషాల పాటు ప్రయాణించి చంద్రుడి దక్షిణ ధృవంపై దిగుతుంది. ఈ 15 నిమిషాలనే అత్యంత ఉత్కంఠరేపే క్షణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యంత క్లిష్టమైన ప్రక్రియ ఇది... దీంతో చంద్రయాన్ సంపూర్ణ విజయం అందుకుంటుంది. ఒక్కసారి లాండర్ చందమామ వద్దకు చేరిన తర్వాత కూడా ఆర్బిటర్ ఏడాది పాటు చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. మొత్తానికి వివిధ దశల్లో చంద్రయాన్ విజయవంతంగా సాగుతోంది. ఈ నెల 7తో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story