సంపర్క్ అభియాన్ సభల కోసం తెలంగాణ బీజేపీ నుంచి ఆరుగురు

బీజేపీ ఎంపీలు, ముఖ్యనేతలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించింది బీజేపీ కేంద్ర నాయకత్వం. ఆర్టికల్ 370, 35ఏ రద్దుపై ఇప్పటికే యూనిటీ క్యాంపెయిన్ చేపట్టగా.. చెన్నైలో మరోసారి వర్క్‌షాప్ నిర్వహించారు. మోదీ ప్రభుత్వ నిర్ణయంపై కొందరు అపోహలు సృష్టించారని బీజేపీ అభిప్రాయం. జమ్ము కశ్మీర్ విభజనకు ముందు.. అక్కడి ప్రజల ఇబ్బందులు ఎలా ఉండేవి.. కొత్త నిర్ణయంతో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈనెల 10 నుండి సంపర్క్ అభియాన్ పేరుతో సమావేశాలు.. ఎమర్జింగ్ ఇండియా పేరుతో సదస్సులు నిర్వహించబోతున్నారు.
సంపర్క్ అభియాన్ సభల కోసం టి-బీజేపీ నుంచి ఆరుగురికి ఆహ్వానం అందింది. కశ్మీర్ వాస్తవ చరిత్ర, ఆర్టికల్ 370, 35ఏ వల్ల కలిగిన నష్టాలపై అవగాహన కల్పించారు. ఆ ఆర్టికల్స్ రద్దు చేయాల్సిన అవసరం.. కశ్మీరీలకు కలిగే లాభాలను వివరించారు. తెలంగాణలో సెప్టెంబర్ 10 నుండి 135 సభలు, సమావేశాలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్. అందులో భాగంగా మేధావులు, అవార్డు గ్రహీతలు, రిటైర్డ్ జడ్జిలు, విశ్రాంత వీసీలు, ప్రొఫెసర్లను కలుస్తారు. మూడు కమిటీలు వేసుకుని.. ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ఇదే అంశంపై పార్టీ ఎంపీలు నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టాలని నాయకత్వం సూచించింది.
కశ్మీర్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిదేననే అభిప్రాయం తొలుత వ్యక్తమైనా.. నెమ్మదిగా సీన్ మారిందని బీజేపీ అభిప్రాయం. 370, 35ఏ రద్దుతో కశ్మీరీలు తమ హక్కులు కోల్పోయారని కొందరి వాదన. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలెందుకని మరోవర్గం ప్రశ్న. మరి, వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యేలా కమలనాథులు చెప్పగలరా? ఈ నిర్ణయం రాజకీయంగా కలిసొస్తుందా?
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com