సరోగసి దందా.. గర్భం మోసే మహిళలకు కూడా తెలియకుండా..

సరోగసి దందా.. గర్భం మోసే మహిళలకు కూడా తెలియకుండా..

గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని సరోగసిని బిజినెస్ గా మల్చుకుంటున్నారు కొందరు డాక్టర్లు. కనీసం గర్భం మోసే మహిళలకు కూడా తెలియకుండా అద్దె గర్భాన్ని అంటగట్టేస్తున్నారు. బాధితుల భర్తలతో మనీ మేటర్ సెటిల్ చేసుకొని.. విషయం బయటికి పొక్కకుండా అమ్మతనంతో ఆడుకుంటున్నారు. ఈ బిజినెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తండా నుంచి.. భువనగిరిలోని ఓ ఆస్పత్రి వరకు పాకింది.

పిల్లలు లేని దంపతులకు సరోగసి ఓ ఊరట. ఆ అవకాశాన్ని కొన్ని కార్పోరేట్ ఆస్పత్రులు అడ్డగోలు దందాగా మార్చేస్తున్నాయి. అడ్డదారి సంపాదన కోసం మాఫియా స్థాయిలో అద్దెగర్భాల వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. చివరికి భార్యాభర్తల మధ్య కూడా చిచ్చుపెట్టి బలవంతంగా ఒప్పిస్తున్నారు.

బూర్గంపాడు మండలం నకిరిపేట గ్రామంలో రాణి అనే మహిళకు ఏడేళ్ల క్రితం భుక్యరమేష్ తో పెళ్లి జరిగింది. ఇద్దరు పిల్లలు. అద్దె గర్భం గురించి దాని నుంచి వచ్చే డబ్బుల గురించి దళారుల ద్వారా తెలుసుకున్నాడు రమేష్. సొమ్ము కోసం ఆశపడి భార్యను అద్దె గర్భం కింద భువనగిరిలోని ఓ ప్రైవేట్ సంతాన సాఫల్య కేంద్రానికి అమ్మేశాడు. ఈ విషయం భార్యకు తెలియనివ్వకుండా ఆస్పత్రి వర్గాలకు అప్పగించాడు. అటు సదరు డాక్టర్ కూడా బాధిత మహిళలకు విషయం చెప్పకుండా మత్తు ఇంజక్షన్ లతో మూడు రోజులు మత్తులోనే ఉంచి సరోగసి ప్రక్రియ ప్రారంభించింది.

అనుమానం వచ్చిన రాణి.. భర్తను నిలదీయటంతో విషయం బయటికి పొక్కితే ఇద్దరు పిల్లలతో పాటు నిన్ను చంపేస్తానంటూ బెదిరించాడు భూక్యరమేష్. దీంతో పుట్టింటికి వెళ్లి విషయం చెప్పిందామె. గుట్టుగా అయిపోతుందని భావించిన సరోగసి సీక్రెట్ బయటికి పొక్కటంతో భార్యకు అబార్షన్ చేయించి విషయం సద్దుమణిగేలా ప్రయత్నించాడు. డబ్బుల కోసం కట్టుకున్న భార్య గర్భాన్ని అద్దెకు ఇచ్చిన భర్త దురాశపై ఆమె తిరగబడింది. కొత్తగూడెం డీఎస్పీ మధుసూదన్ రావుకు ఫిర్యాదు చేసింది.

సరోగసిపై నగరాల్లో అప్రమత్తత పెరగటంతో సాంతన సాఫల్య కేంద్రాల పేరుతో వ్యాపారం చేస్తున్న కార్పోరేట్ డాక్టర్లు ఇలా పల్లె ప్రజల అమాయకత్వంతో బిజినెస్ చేస్తున్నారు. అమాయకత్వం, పేదరికాన్ని ఆసరాగా చేసుకొని గర్భాలను అద్దెకు తీసుకొని అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. భర్త డబ్బాశపై పోరాటం ప్రారంభించినబాధితురాలు.. వ్యాపారం కోసం తన జీవితంలో చిచ్చు రేపిన భువనగిరి ఆస్పత్రి డాక్టర్లను కూడా వదిలేది లేదని చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story