తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు శాసనభ కార్యదర్శి నోటిఫికేషన్‌ జారీ చేశారు. గత బడ్జెట్‌ సమావేశాల్లో ఆరు నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం పొందగా.. ఆ గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది కేసీఆర్‌ సర్కార్‌. ఈ సమావేశాలు దాదాపు పది రోజుల పాటు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఏఏ అంశాలు చర్చించాలనే విషయంపై మాత్రం బీఏసీలో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయానికి వస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సమావేశం మొదటి రోజే సీఎం కేసీఆర్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక శాఖ ఆయన వద్దే ఉండటంతో కేసీఆరే స్వయంగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

త్వరలోనే తెలంగాణ కొత్త గవర్నర్‌ బాధ్యతలు తీసుకోనున్న నేపధ్యంలో... సీఎం కేసీఆర్‌ గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. బడ్జెట్ పై చర్చించి సమావేశాల తేదీని కూడా ఖరారు చేశారు. దాదాపు పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు అధిక మొత్తంలో కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే పీఆర్సీకి నిధులు కేటాయిస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. పీఆర్సీపై వేసిన కమిటీ ఇప్పటి వరకూ నివేదిక సమర్పించకపోవడంతో దీనిపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఆర్థిక మాంద్యం ఉన్న నేపధ్యంలో పద్దులు పొదుపుగా రూపొందించాలని గత వారం రోజులుగా కేసీఆర్‌ అధికారులకు చెబుతూ వస్తున్నారు. దీంతో బడ్జెట్‌లో సాధారణ కేటాయింపులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది.

గత అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ చట్టంలో మార్పులు తెస్తూ నూతన పాలసీని తెలంగాణ సర్కారు తీసుకువచ్చింది. అసెంబ్లీలో పాస్ అయినా.. అందులో ఉన్న లోపాలు ఎత్తి చూపుతూ బిల్లును గవర్నర్ తిప్పిపంపడంతో వెంటనే ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది సర్కారు. ఇక ఇదే సమావేశాల్లో నూతన రెవెన్యూ చట్టాన్ని కూడా తీసుకురావాలని డిసైడ్ అయింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లతో రెండు రోజుల పాటు సమావేశం నిర్వహించిన కేసీఆర్.. బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి .. కొత్త రెవెన్యూ పాలసీని తీసుకురావాలని భావిస్తున్నారు.

ఇప్పటికే విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ఆరోపణలు చేయడంతో.. దీనిపై సమావేశాలు వాడివేడీగా జరిగే అవకాశాలున్నాయి. కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో ప్రతిపక్షాలు పెద్దగా వాయిస్ వినిపించలేక పోయాయి. కానీ గత కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై , విద్యుత్ కోనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగాయిని ఆరోపిస్తున్నారు. అధారాలతో సహా నిరూపిస్తామని విపక్ష నేతలంటుంటే .. సిబిఐ విచారణకైనా సిద్దమని అధికారులు జవాబు చెపుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. మరి ఎవరిది పై చెయ్యి అవుతుందనేది ఆసక్తికరంగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story