తెలంగాణ ఆర్టీసీలో స‌మ్మె సైర‌న్ !

తెలంగాణ ఆర్టీసీలో స‌మ్మె సైర‌న్ !

తెలంగాణ ఆర్టీసీలో స‌మ్మె సైర‌న్ మోగింది. కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో ప్ర‌భుత్వం, యాజ‌మాన్యం విఫ‌ల‌మ‌య్యాయంటూ కార్మిక సంఘం యాజ‌మాన్యానికి స‌మ్మె నోటీసులిచ్చింది. 14 రోజుల్లోగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి యాజ‌మాన్యం ముందుకు రాకపోతే.. ఏ రోజైనా స‌మ్మెకు వెళ్తామ‌ని తేల్చి చెబుతున్నారు.

టీఎస్ ఆర్టీసీ ప‌రిస్థితి రోజురోజుకు మ‌రింత దిగ‌జారుతోంది. పెడుతున్న ఖ‌ర్చుల‌కు... వ‌స్తున్న ఆదాయానికి పొంత‌న లేకపోవ‌డంతో అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం ప‌ట్టించుకోకపోవ‌డంతో క‌ష్టాలు రెట్టింప‌య్యాయి. తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. సొంతంగా ఆదాయం స‌మ‌కూర్చుకునే ప్ర‌య‌త్నాలు చేయాలంటూ సీఎం కేసీఆర్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించి మరీ సూచ‌న‌లు చేశారు. ఐతే.. ప‌రిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. రోజురోజుకు మ‌రింది దిగ‌జారుతూ వ‌స్తోంది. గ‌తంలో స‌మ్మె సంద‌ర్భంగా ఆర్టీసీ కార్మికుల‌కు 43శాతం వేత‌నాలు పెంచింది ప్ర‌భుత్వం. దీంతో సంస్థ‌పై ఏటా వంద‌ల కోట్ల రూపాయల అద‌న‌పు భారం ప‌డింది. ఇక కార్మిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా మ‌రో మారు భారీగా వేత‌నాలు పెంచుతామంటు ప్ర‌భుత్వ పెద్ద‌లు హామీ ఇవ్వ‌డంతో.. అనుబంధంగా కొన‌సాగుతున్న టీఎంయూ ఘ‌న‌విజ‌యం సాధించింది. ఆ త‌రువాత ప్ర‌భుత్వం కార్మికుల స‌మ‌స్య‌లు, సంస్థ బాగోగుల‌ను ప‌ట్టించుకోకపోవ‌డంతో.. పెరుగుతున్న ఖ‌ర్చు భారం మోయ‌లేక పోతోంది సంస్థ‌. మ‌రోవైపు ఏడేళ్ళుగా సిబ్బంది నియామ‌కం లేక పోవ‌డంతో ఉన్న వారిపై అద‌న‌పు ప‌ని భారం ప‌డుతోంది. గ‌తంలో కంటే అద‌నంగా ప‌నిగంట‌లు పెర‌గ‌డంతో కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం ప‌డుతోంది. ఖ‌ర్చు త‌గ్గించుకోవ‌డంలో భాగంగా అనేక అనుబంద శాఖ‌ల‌ను మూసి వేసింది యాజ‌మాన్యం. దీనిపై కార్మికులు ఆందోళన వ్య‌క్తం చేసినా ప‌ట్టించుకోవడం లేదు.

తాజాగా మ‌రోమారు కార్మిక సంఘాలు త‌మ హ‌క్కులు సాధించుకునేందుకు స‌మ్మె వైపు చూస్తున్నాయి. కార్మికుల నుండి సంఘాల నేత‌ల‌పై వ‌స్తున్న ఒత్తిళ్ల‌తో స‌మ్మెనోటీసులు ఇచ్చేందుకు ఒక్కో యూనియ‌న్ బ‌స్ భ‌వ‌న్ వైపు క్యూ క‌డుతున్నాయి. త‌మ డిమాండ్ల‌ను ప్ర‌స్తావిస్తూ గ‌త కొంత కాలంగా అన్ని యూనియ‌న్లు అందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చాయి. బ‌స్ భ‌వ‌న్, ఆర్ఎం కార్యాలయాలు, డిపోల వ‌ద్ద ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన యూనియ‌న్లు.. ఇక స‌మ్మెనోటీసులు ఇవ్వ‌డ‌మే శ‌రణ్యంగా భావిస్తున్నాయి. తెలంగాణ జాతీయ మ‌జ్దూర్ యూనియ‌న్ బ‌స్ భ‌వ‌న్ లో ఆర్టీసీ అధికారుల‌కు స‌మ్మెనోటీసులు ఇచ్చింది. సంస్థ ఆర్థికంగా చితికి పోతున్నా, అన్ని వ్య‌వ‌స్థలు ఇబ్బందుల్లో ఉన్నా ప్ర‌భుత్వం కాని యాజ‌మాన్యం కాని ప‌ట్టించుకోవ‌డంలేద‌ని ఆ యూనియ‌న్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆంధ్రప్ర‌దేశ్ లో సంస్థ‌ను ప్ర‌భుత్వంలో విలీనం చేసేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌మిటీ వేయ‌డం , ఉద్యోగుల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించేందుకు ముందుకు రావ‌డాన్ని ప్ర‌స్తావిస్తున్న యూనియ‌న్ నేత‌లు.. తెలంగాణ‌లో కూడా ఇదే త‌రహా చ‌ర్య‌లు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. ప్ర‌భుత్వం, యాజ‌మాన్యం దిగిరాక పోతే 14 రోజుల నోటీస్ పిరియెడ్ త‌రువాత ఏ క్ష‌ణంలో అయినా స‌మ్మెకు వెళ్తామంటున్నారు ఆ యూనియ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హ‌నుమంత్. ఆర్టీసీ యూనియన్ల స‌మ్మెనోటీసుల హెచ్చ‌రిక‌ల‌తో ప్ర‌భుత్వం దిగి వ‌స్తుందా.. లేక గ‌తంలో ముఖ్య‌మంత్రి హెచ్చ‌రించి‌నట్టుగా సంస్థ‌ను మూసివేసేందుకే మొగ్గుచూపుతుందో వేచిచూడాలి.

Tags

Read MoreRead Less
Next Story