వైఎస్ వివేకానందరెడ్డి కేసు నిందితుడు శ్రీనివాసులురెడ్డి..

వైఎస్ వివేకానందరెడ్డి కేసు నిందితుడు శ్రీనివాసులురెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులు తాళలేకే బలవన్మరణం చేసుకున్నట్లు సూసైడ్ లెటర్ రాశాడు. వైఎస్ వివేకా కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. సీఎం జగన్, వైఎస్ భాస్కర్‌రెడ్డిలకు వేర్వేరుగా లేఖలు రాశాడు. సీఐ శ్రీరాములు తీవ్రంగా వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కడప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసులురెడ్డి మృతిచెందాడు.
వివేకా కేసులో అసలు దోషులెవరన్నది ఇప్పటికీ తేలలేదు. మార్చినెలలో ఘటన చోటుచేసుకున్నా ఇప్పటికీ సిట్ దర్యాప్తులో కీలకమైన ఆధారాలేమీ దొరక్కపోవడంతో కాల్‌డేటా ఆధారంగా మరోసారి విశ్లేషిస్తున్నారు. కొందరు నిందితులకు నార్కో ఎనాలసిస్ పరీక్షలు కూడా చేయించారు. ఈ క్రమంలోనే 60 మందిని విచారించిన సిట్ బృందం.. సాక్ష్యాలు సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వాచ్‌మెన్ కుమారుడు ఇలా ఆ ఘటనతో సంబంధం ఉందని అనుమానం వచ్చిన వారందరినీ విచారించినా చిక్కుముళ్లు మాత్రం వీడడం లేదు. ఈ క్రమంలోనే శ్రీనివాసులురెడ్డిని విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. ఐతే.. అతను బలవన్మరణానికి పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com