బీజేపీ మిత్రులు చివరకు విజయం సాధించారు : డీకే శివకుమార్

బీజేపీ మిత్రులు చివరకు విజయం సాధించారు : డీకే శివకుమార్
X

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ అరెస్టు చేసిన కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ను అధికారులు నేడు కోర్టు ముందు హాజరుపరిచనున్నారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్ యాక్ట్‌ కింద అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు.. ఈడీ కోర్టులోనే ప్రవేశపెట్టనున్నారు. తమ ప్రశ్నలకు డీకే సరిగా సమాధానాలివ్వలేదని, మరింత లోతుగా విచారించేందుకు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరనుంది ఈడీ. 14 రోజులు కస్టడీ కోరే అవకాశం ఉంది.

సుమారు 8 కోట్ల 50లక్షలకు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసుతో సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబరులో శివకుమార్‌ సహా ఢిల్లీలోని కర్ణాటక భవన్‌ ఉద్యోగి హనుమంతయ్య మరికొందరిపై కేసులు నమోదు చేశారు. నాలుగు రోజులుగా అధికారులు ఢిల్లీలోని ఈడీ హెడ్‌క్వార్టర్స్‌లో విచారించారు.

తనను అరెస్టు చేయాలన్న లక్ష్యంలో భాగంగానే బీజేపీ మిత్రులు చివరకు విజయం సాధించారని.. వారిని అభినందిస్తున్నానని శివకుమార్‌ తన ట్విటర్‌ లో వ్యాఖ్యానించారు. డీకే అరెస్టులో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. డీకే అరెస్టు వార్తతో కాంగ్రెస్‌ కార్యకర్తలు, డీకే అభిమానులు ఆందోళనకు దిగారు. ఆయనను మంగళవారం రాత్రి ఈడీ అధికారులు అరెస్టు చేయడంపై కాంగ్రెస్‌ విరుచుకుపడింది. దేశంలోని అనేకమంది బీజేపీ నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ప్రతిపక్షాలకు చెందిన నేతలను టార్గెట్‌ చేసి వేధిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

అరెస్టు తర్వాత డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. ఆయన అరెస్టయితే తమకు సంతోషం ఎందుకుంటుందని ప్రశ్నించారు. ఆయన విడుదల కావాలని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చారు. తాను ఎవర్నీ వ్యతిరేకించలేదని, ఎవరికీ హాని కూడా తలపెట్టలేదని అన్నారు. ఈ కేసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. వాస్తవానికి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముందుగా అధికారం చేపట్టింది యడ్యూరప్పే. ఐతే.. బలపరీక్షలో ఆయన్ను ముప్పుతిప్పలు పెట్టి కాంగ్రెస్-JDS ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసి క్యాంప్ రాజకీయం నడిపించడంలో DKదే కీలక పాత్ర. ఆ తర్వాత కుమారస్వామి CM అయినా ఆ సర్కారు కుప్పకూలి మళ్లీ BJP నుంచి యడ్యూరప్ప CM పీఠం ఎక్కారు. ఈ నేపథ్యంలో.. డీకే అరెస్టుపై రిపోర్టర్ల ప్రశ్నలకు యడ్యూరప్ప తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

Next Story

RELATED STORIES