ఏపీ సర్కారుకు కేంద్రం షాక్.. ఐపీఎస్‌ స్టీఫెన్‌ రవీంద్ర..

ఏపీ సర్కారుకు కేంద్రం షాక్.. ఐపీఎస్‌ స్టీఫెన్‌ రవీంద్ర..

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర… కేడర్‌ మార్పునకు కేంద్రం నో చెప్పింది. దీంతో ఆయన్ను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ గా నియమించాలని భావించిన ఏపీ సర్కారు ఆశ నిరాశయింది.

ఏపీలో వైసీపీ సర్కారు ఏర్పాటయ్యాక సీఎం జగన్… హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీగా ఉన్న స్టీఫెన్‌ను తమ రాష్ట్రానికి పంపాలని కోరారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు పరస్పరం అంగీకారం తెలుపుతూ యూపీఎస్సీకి లేఖ రాశాయి. దీంతో స్టీఫెన్‌ రవీంద్రను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించడం లాంఛనమేనని అంతా భావించారు. 15 రోజుల్లోనే ఆమోదముద్ర లభిస్తుందనుకున్నారు. కానీ 3 నెలల తర్వాత కేంద్రం స్టీఫెన్ రవీంద్ర కేడర్‌ మార్పు కుదరదని స్పష్టం చేసింది.

మే చివరి వారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీకి పంపడానికి ఆమోదం తెలపగానే.. స్టీఫెన్‌ రవీంద్ర సెలవులపై వెళ్లారు. ఏపీలో అనధికారికంగా ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఎక్కడా ఫైళ్ల పైన సంతకాలు చేయకున్నా.. నిఘా విభాగాధిపతిగా వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. అయితే కేంద్రం కేడర్ మార్పునకు నో చెప్పడంతో స్టీఫెన్ రవీంద్ర తిరిగి తెలంగాణకే రానున్నారు. మరోవైపు ఆయన తరహాలోనే ఏపీకి వెళ్లాలనుకుంటున్న మరికొందరు ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు కూడా కేంద్రం తాజా నిర్ణయంతో ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారం ఉన్న స్టీఫెన్‌ విషయంలోనే కేంద్రం నుంచి ఆమోదం లభించకుంటే.. తమ పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story