ఏపీలో పడకేసిన ప్రగతి.. గగ్గోలు పెడుతున్న జనం

ఆంధ్రప్రదేశ్‌లో పాలన పడకేసిందా.. పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వైసీపీ 100 రోజుల పాలనకే జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజకీయ పక్షాలు ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. ప్రధాన విపక్షమైన టీడీపీతోపాటు జనసేన, బీజేపీ క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నాయి. అమరావతి, పోలవరం, పీపీఏలు, ఇసుకలాంటి అంశాల్లో అందరిదీ ఒకే మాటగా ఉంది. ఈ నేపథ్యంలోనే వేర్వేరు ప్రణాళికలతో పార్టీలు జనంలోకి వెళ్తున్నాయి. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు పోరుబాట మొదలుపెట్టారు. ఇదే జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేధోమథనం చేయబోతున్నారు. ఇక బీజేపీ కూడా వైసీపీ ప్రభుత్వంపై ఉద్యమాంశాలను గుర్తించే పనిలో బిజీగా ఉంది.
మతపరమైన అంశాల్లో బీజేపీ ఢిల్లీ నాయకత్వం తీవ్రంగా స్పందిస్తోంది. తిరుమలలో బస్సు టిక్కెట్లపై జెరూసలెం యాత్ర ప్రచారంపైన కూడా బీజేపీ సీరియస్‌గా ఉంది. తాజాగా పాస్టర్లకు గౌరవ వేతనంపై మరింత సీరియస్ అవుతోంది బీజేపీ నాయకత్వం. ఇలా వరుసగా అన్ని పార్టీల ముప్పేట దాడితో జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఐతే.. పైకి ఆ కంగారు కనిపించకుండా ఉండేందుకు ట్రై చేస్తున్నారు వైసీపీ నేతలు. ఎవరేమన్నా తాము అనుకున్న విషయాల్లో మొండిగానే ముందుకెళ్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com