బామ్మగారికి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారోచ్!

బామ్మగారికి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టారోచ్!

పిల్లల కోసం 57 ఏళ్ల పాటు ఎదురుచూసిన ఓ మహిళ నిరీక్షణ ఫలించింది. 74 ఏళ్ల మంగాయమ్మ పండంటి ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. గుంటూరులోని అహల్య ఆసుపత్రిలో సిజేరియన్‌ ద్వారా ఆమెకు కవలలు జన్మించారు.

తూర్పుగోదావరి జిల్లా నెల పర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962 మార్చి 22న పెళ్లయింది. ఎన్నేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచినా వారి ఆశలు నెరవేరలేదు. అలా చూస్తుండగానే వారిద్దరూ వృద్ధులయ్యారు. ఈ క్రమంలో వారికి పొరుగునే ఉన్న ఓ మహిళ 55 ఏళ్ల వయసులో కృత్రిమ సంతాన సాఫల్య విధానంలో తల్లి అయ్యారు. దీంతో తాము కూడా పిల్లల కోసం IVF పద్ధతితో ప్రయత్నిద్దామని నిర్ణయించుకున్నారు దంపతులు.

గుంటూరులోని అహల్య నర్సింగ్‌ హోమ్‌‌కు వెళ్లి డాక్టర్‌ శనక్కాయల ఉమా శంకర్‌ను కలిశారు మంగాయమ్మ దంపతులు. బీపీ, షుగర్‌ లాంటి సమస్యలు లేకపోవడంతో వైద్యులు ఆమెకు చికిత్స ప్రారంభించారు. మెనోపాజ్‌ దశ దాటిపోవడంతో వేరే మహిళ నుంచి అండాన్ని, భర్త నుంచి వీర్యాన్ని సేకరించి IVF పద్ధతిలో ప్రయత్నించారు. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించగా బామ్మ గర్భం దాల్చినట్టు గుర్తించారు. అప్పటి నుంచి ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. నెలలు నిండటంతో నేడు సిజేరియన్‌ ద్వారా కాన్పు చేశారు.

గతంలో 70 ఏళ్ల మహిళ తల్లైనట్టు రికార్డులున్నాయి. ఆమెపేరు దల్జీందర్‌ కౌర్‌. 2016 ఏప్రిల్‌ 19న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ లెక్కన 74 ఏళ్ల వయసులో మంగాయమ్మకు కవలలు పుట్టడంతో పాత రికార్డు చెరిగిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story