వైసీపీ-బీజేపీ మధ్య మరో వివాదం

వైసీపీ-బీజేపీ మధ్య మరో వివాదం

ఏపీలో వైసీపీ-బీజేపీ మధ్య మరో వివాదం మొదలైంది. పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలన్న జగన్ సర్కార్‌ నిర్ణయంపై ఇటు రాష్ట్ర, అటు జాతీయ బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం గ్రామ వాలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్‌సీపీ దుర్వినియోగ పరుస్తోందని మండిపడుతున్నారు. జగన్‌ రియల్ ఎజెండా ఏంటో చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

తిరుమలలో అన్యమత ప్రచారం.. అమెరికాలో ఏపీ సీఎం జగన్‌ జ్యోతి ప్రజ్వలన చేయకపోవడం. ఏపీలో పాస్టర్లకు గౌరవ వేతనాలు.. ఇలా వరుస ఘటనలపై బీజేపీ ఆందోళన చేస్తోంది. సీఎం జగన్ ఒక మతానికి అనుకూల‌ నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ బీజేపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. పాస్టర్లకు గౌరవ వేతనానికి సంబంధించి ప్రభుత్వ నిధులు వెచ్చించి సర్వే చేయడమేంటని ఆంధప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతానికి అనుకూలంగా ప్రభుత్వ విధానాలున్నాయని ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. అన్ని మతాల్లోనూ పేదలు ఉన్నారని, కేవలం పాస్టర్లకే ఎలా వేతనం ఇస్తారని సునీల్‌ దేవధర్‌ ప్రశ్నించారు.

ఈ వివాదంపై ఏపీ బీజేపీ నేతలు కూడా సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనానికి సంబంధించిన లబ్దిదారుల్ని గుర్తించేందుకు.. గ్రామ వాలంటీర్ల ద్వారా సర్వే చేయించి దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇలాంటి మతపరమైన నిర్ణయాలు సరికాదని.. వెంటనే సర్వేను నిలిపివేయాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇప్పటికే జగన్‌ సర్కార్‌ తీసుకున్న పలు నిర్ణయాలపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ మంచిదికాదని వారించినా ఏపీ కేబినెట్‌ రివర్స్‌ టెండరింగ్‌కు ఆమోదం తెలిపింది. పీపీఏల రద్దు, రాజధాని తరలింపు తదితర అంశాల్లో వైసీపీ తీరును బీజేపీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. వీటికి తోడు మతపరమైన అంశాలు రెండు పార్టీల మధ్య చిచ్చుపెడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story