వైఎస్‌ వివేకా హత్యకేసులో మరో కీలక పరిణామం

వైఎస్‌ వివేకా హత్యకేసులో మరో కీలక పరిణామం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసును త్వరగా తేల్చాలని పోలీసులకు సూచించినట్లు సమాచారం. దీంతో కడపకు వచ్చిన డీజీపీ గౌతం సవాంగ్.. కేసు విచారణపై పోలీసు ఉన్నతాధికారులు, సిట్‌ బృందంతో సమావేశం నిర్వహించారు. నార్కో అనాలసిస్‌ పరీక్షలకు గుజరాత్‌ వెళ్లి వచ్చిన ఎర్ర గంగిరెడ్డి, వాచ్‌మెన్‌ రంగన్న, శేఖర్‌ రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డిలు తదనంతర పరిణామాలపైన ఆరా తీసినట్లు సమాచారం. అనంతరం పులివెందులలో వివేకా ఇంటిని పరిశీలించారు డీజీపీ.

ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమేశ్వర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డిలను సిట్‌ బృందం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనను, తన కుటుంబాన్ని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన సూసైడ్ చేసుకున్నారు. తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ శ్రీనివాసులురెడ్డి సీఎం జగన్‌కు లేఖ కూడా రాశాడు. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. విచారణకు పిలిస్తే ఆత్మహత్య చేసుకోవాల్సిన విషయం ఏమొచ్చింది? దీని వెనుక ఎవరున్నారనే కోణంలోనూ డీజీపీ ఆరా తీసినట్లు సమాచారం.

హత్య జరిగినప్పటి నుంచి కేసు రోజుకో మలుపు తిరుగుతూనే వుంది. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేపడుతున్నా ఓ కొలిక్కి రాలేదు. వివేకా హత్య జరిగి నెలలు గడుస్తున్నా.. ఇంత మందిని టెస్టులకు పంపినా.. కోర్టుల చుట్టూ తిప్పుతున్నా ఇంకా ఎందుకు అసలు నిజాలు బయటకు రావడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. రెండు రోజుల్లో వివేకా హత్యకు సంబంధించి పోలీసుల నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story