లక్షల మందికి జ్వరం వస్తే ఏం చేస్తున్నారు?

లక్షల మందికి జ్వరం వస్తే ఏం చేస్తున్నారు?

సీజన్‌ వ్యాధుల పట్ల తెలంగాణ సర్కార్‌ అప్రమత్తంగా ఉందన్నారు మంత్రి ఈటెల రాజేందర్‌. హాస్పటల్‌ కు వచ్చిన కేసులు అన్నీ డెంగ్యూ కేసులు కావన్నారు. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులకు సూచించామన్నారు. హాస్పిటల్స్‌ ఓపీ సమయం కూడా పెంచామని తెలిపారు. దీనికి తగ్గట్టుగా మందులను కూడా అందుబాటులో ఉంచామన్నారు. డాక్టర్లను కూడా అదనంగా నియమించామన్నారు. హైదరాబాద్ గాంధీ హస్పిటల్ లో అదనంగా ఏర్పాటు చేసిన ఓపి బ్లాక్ ను మంత్రి తలసానితో కలిసి ప్రారంభించారు ఈటెల. కాని వాస్తవ పరిస్థితులు చూస్తే వేరుగా ఉన్నాయి.

కళ్లు వాలిపోతున్నాయి. కాళ్లు తేలిపోతున్నాయి. ఒళ్లు కాలిపోతోంది. నీరసం నిలువెల్లా ఆవరిస్తుంది. ఎటూ చూడలేరు. ఏమీ చేయలేరు. జ్వరం. భయంకరమైన జ్వరం. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, వైరల్, టైఫాయిడ్.. ఇలా జ్వరాలన్నీ తెలుగు రాష్ట్రాలపై ముప్పేట దాడి చేశాయి. తెలంగాణలో అయితే దోమలన్నీ కనికారం లేకుండా ప్రజలను కాటేస్తున్నాయి.

ఐదు వారాల్లో 1348 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయంటే ఏం చెప్పాలి? నాలుగు వారాల్లో లక్షా 30 వేల మందికి పైగా విషజ్వరాల బారిన పడ్డారంటే పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? అందులోనూ ఇందులో 50 శాతం మంది చిన్నారులే ఉన్నారంటే ఆ పాపం ఎవరిది? ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ దగ్గరే గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోందంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?

తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, పెద్దపల్లి, కరీంనగర్.. ఈ 9 జిల్లాల్లో డెంగ్యూ ముప్పు అధికంగా ఉంది. జలుబు, దగ్గు, జ్వరంతో మంచానపడుతున్నారు. ఆస్పత్రుల్లో పెద్దవాళ్లనయితే ఒకే పడకపై ఇద్దరిని, పిల్లలనైతే ఒకే పడకపై ముగ్గురుని ఉంచి మరీ వారికి సెలైన్లు ఎక్కిస్తున్నారు. చికిత్స చేస్తున్నారు. కారణం.. ప్రభుత్వం, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలే కరవయ్యాయి. అసలు.. తెలంగాణను ఈ స్థాయిలో జ్వరాలు ఎందుకు పట్టిపీడిస్తున్నాయి?

తెలంగాణలో ఎక్కువ డెంగ్యూ కేసులు వెలుగుచూడడం వెనుక చాలా కారణాలున్నాయి. అయితే డెంగ్యూతో పాటు వైరల్ జ్వరాల్లోనూ ప్లేట్ లెట్లు పడిపోతాయి. కాని ఏది వైరల్ ఫీవరో, ఏది డెంగ్యూ జ్వరమో ప్రజలకు ఎలా తెలుస్తుంది? అందుకే జ్వరం అని తెలిసిన వెంటనే.. భయంతో అందరూ ప్లేట్ లెట్ల పరీక్ష చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. హైదరాబాద్ లోని ఫీవర్, గాంధీ, నీలోఫర్, ఉస్మానియా, వరంగల్ లోని ఎంజీఎంతో పాటు జిల్లాల్లోని ఆసుపత్రులకు రోజూ వేల మంది జ్వర బాధితులు వస్తున్నారు.

తెలంగాణలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కేవలం జ్వరాలతో వచ్చేవారు సగటున వంద మందైనా ఉంటారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు నిండిపోయాయి. అందుకే ఒక్కో పడకలో ఇద్దరు, ముగ్గురుని ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. దీంతో తెలిసినవారితో చెప్పించి మరీ పేషెంట్లుగా చేరుతున్నారు. ఈ పరిస్థితులే ప్రైవేటు ఆసుపత్రుల పంట పండిస్తోంది. ఎందుకంటే ఇక్కడ పరీక్షలకే దాదాపుగా 10 వేల రూపాయిల వరకు ఖర్చవుతాయి. ఒకవేళ పొరపాటున ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందంటే లక్ష రూపాయిల నుంచి రెండు లక్షల రూపాయిల వరకు చెల్లించుకోవాల్సిందే!

Tags

Read MoreRead Less
Next Story