కీలక ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్‌ 2.. చరిత్ర సృష్టించనున్నఇస్రో

కీలక ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్‌ 2.. చరిత్ర సృష్టించనున్నఇస్రో

130 కోట్ల మంది భారతీయుల స్వప్నం సాకారం అయ్యే సమయం ఆసన్నమైంది. కొత్త చరిత్రను సృష్టించే ఆ క్షణం కోసం భారతీయులంతా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రపంచదేశాల చూపంతా చంద్రయాన్‌-2 పైనే. అర్థరాత్రి దాటాక సరిగ్గా ఒంటి గంట 40 నిమిషాల నుంచి ఒంటి గంట 55 నిమిషాల మధ్య జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండ్‌ కానుంది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్‌ను గురువారం నాటికి చంద్రుడికి 35 కిలోమీటర్లు దగ్గరగా.. 101 కిలోమీటర్లు దూరంగా ఉండే కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆర్బిటర్‌ చంద్రుడికి 96 కిలో మీటర్లు దగ్గరగా..125 కిలోమీటర్లు దూరంగా ఉండే చంద్రకక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఇక మిగిలింది ల్యాండర్‌ విక్రమ్‌ను చంద్రుడిపై దించడమే. తుది ఘట్టం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై సమాంతరంగా ఉండే స్థలాన్ని.. ఆర్బిటర్‌కు అమర్చిన అర్బిటర్‌ హై రిజల్యూషన్‌ కెమెరా ద్వారా అన్వేషించనున్నారు. అక్కడ విక్రమ్‌ దిగేందుకు అనువైన స్థలం లేకపోతే.. పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించి.. సమతులంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేస్తారు. అలా అరగంటలో స్థల అన్వేషణ పూర్తి చేసిన తరువాత ఒంటి గంట 30 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల మధ్య విక్రమ్‌ ల్యాండర్‌ను జాబిల్లిపై దించే ప్రయత్నం చేయనున్నారు. ల్యాండర్‌ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు. దాదాపు 15 నిమిషాలపాటు ఈ ల్యాండింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఈ 48 రోజుల ప్రయాణం ఒక ఎత్తైతే.. చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగే 15 నిమిషాలు అత్యంత కీలకమైననదిగా చెబుతున్నారు ఇస్రో సైంటిస్టులు.

విక్రమ్‌ ల్యాండర్‌ను శనివారం తెల్లవారుజామున ఒంటి గంట 55 నిమిషాలకు చంద్రుడిపైకి విజయవంతంగా చేర్చిన 4 గంటల తర్వాత.. అంటే ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర గంటల మధ్య అందులోంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకు వచ్చి 14 రోజులపాటు పరిశోధనలు చేయనుంది. ఆ సమయంలో అది విక్రమ్‌ నుంచి 500 మీటర్ల దూరం ప్రయాణించనుంది. తాను సేకరించిన సమాచారాన్ని విక్రమ్‌కు చేరవేస్తుంది. విక్రమ్‌ ద్వారా ఆ సమాచారం బెంగళూరుకు సమీపంలోని బైలాలులో ఉన్న ఇండియన్‌ డీప్‌స్పేస్‌ నెట్‌వర్క్‌కు అందుతుంది.

భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్టే చంద్రుడికి కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రస్తుతం చంద్ర కక్ష్యలో తిరుగుతున్న విక్రమ్‌ ల్యాండర్‌.. మామూలుగా జాబిలి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే ఆ ఆకర్షణ శక్తికి వేగంగా వెళ్లి కూలిపోతుంది. అలా కూలిపోకుండా ఉండేందుకు విక్రమ్‌లోని డైరెక్షనల్‌ థ్రస్టర్లను మండించడం ద్వారా గమన వేగాన్ని కొనసాగిస్తూ అది చంద్రుడిపై నెమ్మదిగా దిగేలా ఇస్రో శాస్త్రజ్ఞులు ఏర్పాట్లు చేశారు. విక్రమ్‌ నెమ్మదిగా దిగడానికి 15 నిమిషాలు సమయం పడుతుంది. ఇంత క్లిష్టం కాబట్టే ల్యాండింగ్‌ను '15 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌'గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన ఘనత అమెరికా, రష్యా, చైనా దేశాలకు మాత్రమే ఉంది.

విక్రమ్‌ ల్యాండింగ్‌ను ప్రధాని మోదీ బెంగళూరులోని మిషన్‌ ఆపరేషన్‌ సెంటర్‌ నుంచి తిలకించనున్నారు. దేశవ్యాప్తంగా 9, 10 తరగతుల విద్యార్థులకు ఇస్రో నిర్వహించిన పోటీల విజేతల్లో రాష్ట్రానికి ఇద్దరు చొప్పున ప్రధానితో కలసి ఈ ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా తిలకిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story