ఎయిర్‌పోర్టులో ఓ మహిళ.. ఆరు రోజుల పసిబిడ్డని బ్యాగులో ఉంచి..

ఎయిర్‌పోర్టులో ఓ మహిళ.. ఆరు రోజుల పసిబిడ్డని బ్యాగులో ఉంచి..

ఎయిర్‌పోర్టులో ఎక్కువ లగేజీని అనుమతించరని తెలుసు.. అడుగడుగునా చెకింగ్ ఉంటుందనీ తెలుసు. అయినా అంత సాహసం ఎలా చేసిందో.. లగేజీ బ్యాగ్‌లోని బిడ్డని చూసి విమాన సిబ్బంది షాక్‌కి గురయ్యారు. ఆరు రోజుల బిడ్డని అమ్మ నుంచి దూరం చేసి అక్రమంగా తరలిస్తుందేమో అన్న అనుమానంతో పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం అమెరికాకు చెందిన ఓ మహిళ ఆరు రోజుల పసికందును రహస్యంగా లగేజీ బ్యాగులో పెట్టి తీసుకెళుతుండా విమాన సిబ్బంది పట్టుకున్నారు. జెన్నిఫర్ ఎరిన్ టాల్బోట్ అనే మహిళ డెట్రాయిట్ వెళ్లేందుకు మనీలా ఎయిర్ పోర్టుకు వచ్చింది. డెల్టా విమానం కోసం ఎదురు చూస్తున్న ఆమె లగేజీని సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు.

బ్యాగుని చేతి నుంచి వదలక పోవడం.. అటు ఇటూ అదే పనిగా చూస్తుండడం సిబ్బందికి ఆమెపై అనుమానం వచ్చేలా చేసింది. సిబ్బంది ఆమె దగ్గరకు వచ్చింది బ్యాగ్‌ని చెక్ చేయాలన్నారు. అందులో ఏమీ లేవు. ఉన్నవన్నీ నా పర్సనల్ థింగ్స్ అనేసరికి.. అవే ఏంటో ఒకసారి చూపించండి అని అడిగారు.. అయినా బ్యాగు చూపించకుండా వారిని దబాయించే సరికి వారికి అనుమానం మరింత ఎక్కువైంది. సిబ్బంది మరి కొందరి సహకారంతో ఆమె వద్దని వారిస్తున్నా బ్యాగ్ ఓపెన్ చేసి చూశారు. అందులో ఓ పసిబిడ్డ ఉండే సరికి ఒక్కసారిగా బిత్తరపోయారు. పోలీసులు ఆమెను విచారించగా ఆ బిడ్డకు తాను బంధువునని చెప్పింది. అయితే ఆ విషయాన్ని నిరూపించేందుకు ఆమె వద్ద ఎలాంటి పత్రాలు లేవు. దీంతో ఆమెపై పిల్లల అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story