హృదయాలకు హత్తుకునే ప్రేమకథ ‘నీకోసం’ రివ్యూ:

హృదయాలకు హత్తుకునే ప్రేమకథ ‘నీకోసం’ రివ్యూ:
X

కొత్తదనం నిండిన సినిమాలను ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరిస్తారు. ఆ నమ్మకంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘నీకోసం’. అరవింద్, అజిత్, సుభాంగి పంత్ , దీక్షితా పార్వతి నటించిన ‘నీకోసం’ రిలీజ్ కి ముందే ఒక మంచి సినిమా అనే టాక్ ని సొంతం చేసుకుంది. అంతా కొత్త వారే అయినా వారి ప్రయత్నంలో ఎంత కొత్తదనం ఉందో చూద్దాం..

కథ:

కౌటిల్య(అరవింద్ రెడ్డి) సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. కార్తిక( సుభాంగి పంత్) అతన్ని ప్రేమిస్తుంది. వారి ప్రేమలో చాలా కోపాలు, తాపాలు, ఇష్టాలు ఉంటాయి. కార్తిక మరొకరితో చనువుగా ఉండటం, తనని ఫ్రెండ్ అని పరిచయం చేయడం కౌటల్యకు కార్తిక పై అనుమానం కలిగిస్తాయి. ఒక బాంబ్ బ్లాస్ట్‌లో ‌కౌటిల్య గాయపడతాడు. అతనికి ఒక డైరీ దొరుకుతుంది. ఆ డైరీ అర్జున్ (అజిత్) ది అతను బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతాడు. ఆ డైరీ ద్వారా అతని ప్రేమకథను తెలుసుకుంటాడు కౌటిల్య. అర్జున్ ప్రేమ విషయం అతని లవర్ కి తెలియదు.. చనిపోయిన అతని ప్రేమను ఆమెకు చెప్పేందుకు కౌటల్య బయలు దేరతాడు. అతని ప్రయాణం ఏ గమ్యానికి చేర్చింది..? తెలియని వ్యక్తి ప్రేమకథ..? తన ప్రేమకథను ఎలా మార్చింది అనేది మిగిలిన కథ..?

కథనం:

సినిమా ప్రమోషన్స్ లో టీం చెప్పిన అందమైన ప్రేమకథ తెరమీద కనబడుతుంది. ప్రేమించిన వారి విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు, కోపాలు ఎంతో విలువైన జీవితాన్ని ఏవిధంగా వృధా చేస్తాయో అరవింద్ క్యారెక్టర్ తో దర్శకుడు అవినాష్ కోకటి చెప్పే ప్రయత్నం బాగుంది. అరవింద్ పాత్ర నేటి యువతరం ఆలోచనలకు దగ్గరగా ఉంటుంది. కొత్త వాడు అయినా అరవింద్ తన పాత్రను చాలా కాన్ఫిడెంట్ గా చేసాడు. ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో చేసినంత ఇన్వాల్ మెంట్ కనిపించింది. సుభాంగి పంత్ ఈ సినిమాకి మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తన పాత్రలోని చిలిపితనం, వయసులోని అల్లరితనం ఆ పాత్ర ను మరింత ఆకర్షణగా మలిచింది. ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మాయి పడే తపన, అతని పై ఆమె చూపించే ఇష్టం ఆ పాత్ర ప్రేమలో ప్రేక్షకులను పడవేస్తాయి. అందరూ కోరుకునే గర్ల్ ప్రెండ్ లక్షణాలు పుష్కలంగా ఆ పాత్రలో దింపాడు దర్శకుడు. కార్తికకు, అరవింద్‌కి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా డిజైన్ చేసాడు. శ్రీనివాస్ శర్మ అందించిన స్వరాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. పాటల చిత్రీకరణ బాగుంది. ఇంకా ఈ సినిమాలో మనిషి తనను తాను వెతుక్కుంటే చేసే ట్రావెల్ అరవింద్ క్యారెక్టర్ తో చూపించాడు. చిన్న చిన్న విషయాలకు ఈగోలకు పోయి రిలేషన్స్ ని దూరం చేసుకుంటున్న యువతకు చెప్పకుండానే ఒక కథతో చాలా పెద్ద పాఠం చెప్పాడు దర్శకుడు. మనుషులు ఉన్నప్పుడు గొడవ పడతాం.. పోయాక బాధ పడతాం.. కానీ ఉన్నప్పుడు ప్రేమతో ఉండగలిగితే ఆ జీవితం చాలా బాగుంటుందనే లైన్ చుట్టూ రాసుకున్న కథ ఆసక్తి గా ఉంది. సెకండ్ లవ్ స్టోరీ లో అజిత్ తన పాత్రలో పూర్తిగా లీనం అయ్యాడు. అమాయకంగా కనిపించే అబ్బాయి పాత్రలో జీవించాడు. అతని లుక్స్ బాగున్నాయి. లీసా క్యారెక్టర్ చేసిన పార్వతి తన పాత్రకు న్యాయం చేసింది. రాత్రి పూటం తాగడం, పొద్దునే గుడికి వెళ్లడం వంటి విభిన్నమైన పాత్రను బాగా లీడ్ చేసింది. ఈ రెండు ప్రేమకథలకు లింక్ అయిన డైరీ ని కథలోకి తీసుకురావడానికి దర్శకుడు తీసుకున్న బాంబ్ బ్లాస్ట్ ఉదంతం బాగున్నా, తెరమీద చాలా పేలవంగా కనిపించింది. ఒక తెలియని వ్యక్తి ప్రేమను గౌరవించే హీరో, తన ప్రేమను ఎందుకు చులకన చేస్తున్నాడు అనే సందేహాలు కలుగుతాయి. అయితే కథను మరో కథకు ముడి పెట్టినప్పుడు దర్శకుడు అరవింద్ పాత్రలోని మార్పులను తెరమీదకు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలుగా మాత్రమే కనపడతాయి. సుదర్శన్ చేసిన కామెడీ కాసేపు నవ్వించింది ప్రేమకథలలో విలన్లు బయటి వారుకాదు.. లోపల దాగున్న ఇగోలు అనే విషయం మరోసారి గుర్తు చేసాడు. సెకండాఫ్ లో అరవింద్ క్యారెక్టర్ చేసిన ట్రావెల్ చాలా ఎమోషనల్ గా మారింది. ‘కన్నులు చూడని నిజమిది.. ఎదురు నిలిచిన వరమిది’ లాంటి సాహిత్య పరమైన విలువలతో నిండిన పాటలు ఈ ప్రేమకథలను మరింత అందంగా మలచాయి. ఇందులో దర్శకుడు తీసుకున్న కథను తెరమీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఒక నిజాయితీతో నిండిన ప్రేమకథను ఎక్కడా అసభ్యానికి తావులేకుండా మలచాడు. కుటుంబ విలువలతో పాటు జీవిత విలువలు మేళవించిన ఈ కథ ఓ మంచి ప్రేమకథను చూసిన అనుభూతికి గురవుతాడు ప్రతి ప్రేక్షకుడు.

చివరిగా:

హృదయాలకు హత్తుకునే ప్రేమకథ ‘నీకోసం’

Next Story

RELATED STORIES