జగన్ 100 రోజుల పాలనలో చేసిందేమీ లేదు - పవన్

తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ పర్యటన 2వ రోజు కొనసాగుతోంది. మల్కిపురం మండలం దిండి రిసార్ట్స్ నుంచి అంతర్వేదికి వెళ్లిన పవన్.. శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం దిండిలోని జాతీయ నాయకుల విగ్రహాలకు పవన్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అటు.. టేకిశెట్టిపాలెంలో పవన్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ప్రజాసమస్యల పరిష్కారం విషయంలో సర్కారుపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు పవన్ కల్యాణ్. జగన్ 100 రోజుల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. ఇకపై ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. సమాచార హక్కు చట్టం ఉపయోగించుకుని వాస్తవాలు వెలికి తీస్తూ సామాన్యులకు అండగా ఉంటామన్నారు. ప్రజలకు కష్టమొస్తే అది తమ కష్టంగా భావించి జనసైనికులు బాధితులకు అండగా నిలవాలని పిలుపిచ్చారు. సమస్యపై నిలదీసేముందు పూర్తి ఆధారాలు తీసుకుని.. న్యాయం కోసం పోరాడాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలంలోని దిండి రిసార్ట్స్‌లో పార్టీ ముఖ్యనేతలు, సీనియర్లతో గురువారం జరిగిన సమావేశంలో పలువురు లీడర్లు చేసిన సూచనల్ని పరిశీలించి.. సంస్థాగతంగా జనసేనను బలోపేతం చేస్తామన్నారు.
ఇకపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అన్ని జిల్లాల్లోనూ నిర్వహిస్తామని ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పార్టీ నుంచి తొలి ఎమ్మెల్యే రాజోలు నుంచి ఉన్నందున ఈసారి సమావేశం తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాటు చేశామన్నారు. పోలవరం, రాజధాని నిర్మాణం, పథకాల అమలు విషయంలో వైఫల్యాలపై ఎలా ఉద్యమించాలనే దానిపై చర్చించారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతోపాటు జిల్లా నేత కందుల దుర్గేష్ సహా మరికొందరు పలు సూచనలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com