జమిలి అయితే 3 ఏళ్లలో ఎన్నికలు.. - చంద్రబాబు

జమిలి అయితే 3 ఏళ్లలో ఎన్నికలు.. - చంద్రబాబు

ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన చంద్రబాబు రెండు రోజులపాటు జిల్లాలోనే మకాం వేసి పార్టీ పరిస్థితిని సమీక్షించారు. ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణాలను సమీక్షించారు. ముఖ్యంగా నేతల వలసలతో డీలా పడుతున్న కార్యకర్తలకు చంద్రబాబు పర్యటన బూస్టప్ ఇచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతోనూ సమావేశమైన చంద్రబాబు పార్టీపై భరోసా కల్పిస్తూనే.. మరోవైపు ప్రభుత్వంపై ఎలా పోరాడాలి అనే దానిపైన దిశానిర్దేశం చేశారు.

తొలిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. విస్తృతస్థాయి సమావేశం తరువాత కాకినాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు అర్ధరాత్రి వరకు పది నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమై పార్టీ పరిస్థితిని సమీక్షించారు. నేతల మధ్య ఉన్న సమన్వయ లోపాలను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి నేతలు విభేదాలు వీడి అంతా కలిసికట్టుగా పనిచేయాలని హితబోధ చేశారు.

జమిలి అయితే 3 ఏళ్లలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న చంద్రబాబు.. పార్టీ శ్రేణులంతా కష్టపడాలని సూచించారు. పార్టీకి దూరమైన వర్గాలకు మళ్లీ దగ్గరయ్యేందుకు అందరం కలిసి పనిచేయాలన్నారు. జగన్‌ సరెండర్‌ పాలిటిక్స్ తో కొత్త రాజకీయాలకు తెరతీశారన్న చంద్రబాబు. ఇంతటి రాక్షస పాలనను తన 40 ఏళ్లలో ఏనాడు చూడలేదన్నారు.

టీడీపీని గ్రామస్థాయి నుంచి టార్గెట్‌ చేశారని అన్నారు. చివరికి తనపైనే దాడులు చేసే పరిస్థితికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి తాను జనంలోకి వచ్చినా కనీసం భద్రత కూడా కల్పించటం లేదని ఆరోపించారు. పీపీఏల రద్దుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఇచ్చినా.. కేంద్రం హెచ్చరించినా జగన్‌ ఒంటెద్దు పోకడకు పోతున్నారని అన్నారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్‌ దాన్ని చివరి అవకాశంగా చేసుకున్నారన్నారు.

అధినేత పర్యటన ఉందని తెలిసినా కొందరు నేతలు సమావేశాలకు మాత్రం రాలేదు. నియోజకవర్గంలోనే ఉండి తోట త్రిమూర్తులు హాజరుకాకపోవడం చర్చకు దారి తీసింది. తోట త్రిమూర్తులు గత కొంతకాలంగా పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధినేత తో సమావేశానికి డుమ్మా కొట్టడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరి నట్లయింది.

మొన్నటి ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసిన మాగంటి రూప కూడా చంద్రబాబుతో సమావేశానికి రాలేదు. కాకినాడ ఎంపీగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ సైతం సమావేశానికి హాజరు కాలేదు. ఇద్దరు నేతలు ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలు అన్నింటికి దూరంగానే ఉంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు వారి స్థానాల్లో కొత్తవారిని ఇంచార్జిలుగా నియమించాలని డిమాండ్ ను చంద్రబాబు ముందుంచారు. రెండు రోజుల తూర్పుగోదావరి పర్యటన సక్సెస్ అవడంతో.. ఇక వచ్చే వారం కడప జిల్లాలో పర్యటించనున్నారు చంద్రబాబు.

Tags

Read MoreRead Less
Next Story