చంద్రయాన్ 2 ను దెబ్బతీసిన ఆ 15 నిమిషాలు!

లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. మరికొన్ని క్షణాల్లో విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిని ముద్దాడుతుందనగా సిగ్నల్స్‌ ఆగిపోయాయి. దీంతో ఉత్కంఠగా ఎదురు చూసిన కోట్లాది మంది భారతీయులు, శాస్త్రవేత్తలు నిర్వేదంలో మునిగిపోయారు. జాబిల్లి.. అందినట్టే అంది జస్ట్‌ మిస్‌ అయ్యింది. సక్సెస్‌ అయిపోతోంది అనుకుంటున్న సమయంలో విక్రమ్‌తో బెంగళూరులోని స్పేస్‌ సెంటర్‌కు సంబంధాలు తెగిపోయాయి. కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్ -2 చిట్ట చివరి నిమిషంలో చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో దారి తప్పింది. ల్యాండింగ్‌ ప్రక్రియలో ఆ 15 నిమిషాలు కీలకం అని ఇస్రో ఛైర్మన్‌ శివన్ ముందు నుంచే చెబుతున్నారు. ఆ 15 నిమిషాలు మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌గా ఆయన అభివర్ణించారు. అవును నిజంగానే విక్రమ్ ల్యాండింగ్‌ ప్రక్రియను ఆ 15 నిమిషాలు దెబ్బతీశాయి. తీవ్ర ఒడిదొడుకులకు లోనైన విక్రమ్‌ చివరి నిమిషంలో స్పేస్‌ సెంటర్‌కు అందకుండా వెళ్లిపోయింది.

బెంగళూరు సమీపంలోని బైలాలులో ఉన్న మిషన్‌ ఆపరేషన్‌ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ల ముందు కూర్చున్న శాస్త్రవేత్తలందరి ముఖాల్లో తీవ్ర ఉత్కంఠ. ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న సైంటిస్టులకు సమయం క్షణమొక యుగంలా గడిచింది. ల్యాండర్‌ ప్రక్రియలో భాగంగా చంద్రుడికి 35 కిలోమీటర్ల దగ్గరగా... 101 కిలోమీటర్ల దూరంగా ఉండే కక్ష్యలో సంచరిస్తున్న ల్యాండర్‌ విక్రమ్‌ ఆ సమయానికి సరిగ్గా దక్షిణ ధ్రువంపై భాగానికి చేరుకుంది. అదే సమయానికి ఎగువన 96 కిలోమీటర్ల దగ్గరగా.. 125 కిలోమీటర్ల దూరంగా చంద్రకక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్‌ సైతం దక్షిణ ధ్రువం వద్దకు చేరుకుంది. అంతలో చంద్రగ్రహంపై సూర్యోదయం ప్రారంభమైంది. సూర్యుడి లేత కిరణాలు చంద్రుడిపై ప్రసరిస్తుండగా.. ఆ వెలుగులో ఆర్బిటర్‌ హైరిజల్యూషన్‌ కెమెరా సాయంతో శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువం ఉపరితలాన్ని పరిశీలించారు. ఎగుడు దిగుళ్లు లేని సమతుల ప్రాంతాన్ని ఎంపిక చేసి విక్రమ్‌ ల్యాండర్‌కు సంకేతాలు పంపారు. ఆ సంకేతాలు అందుకుని విక్రమ్‌ కిందికి దిగడం ప్రారంభించింది. అందులో ఉన్న లిక్విడ్‌ థ్రస్టర్‌ ఇంజన్లు మండటం ప్రారంభించి విక్రమ్‌ వేగాన్ని నియంత్రించాయి. ల్యాండర్‌లోని లేజర్‌ అల్టిమీటర్‌, ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా యాక్టివేట్‌ అయ్యాయి. 10 నిమిషాల తర్వాత విక్రమ్‌.. చంద్రునికి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అప్పటికి విక్రమ్‌ వేగాన్ని థ్రస్టర్‌ ఇంజన్లు గంటకు 526 కిలోమీటర్లకు నియంత్రించాయి. అనంతరం మరో 38 సెకన్లకు గంటకు 330 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్‌.. చంద్రునికి 5 కిలోమీటర్ల ఎత్తుకు దిగింది. 2.1 కిలోమీటర్ల ఎత్తువరకూ నిర్ణీత షెడ్యూలు ప్రకారమే వెళ్లింది. ఆ తర్వాత ఏమైందో ఏమో.. విక్రమ్‌ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. దీంతో శాస్త్రవేత్తల్లో నిర్వేదం అలుముకుంది

విక్రమ్‌ ల్యాండర్‌ దారి తప్పిన తరువాత సిగ్నల్స్‌ కోసం ఇస్రో సైంటిస్టులు తీవ్రంగా ప్రయత్నించారు. సుమారు 40 నిమిషాల పాటు శాస్త్రవేత్తలు సిగ్నల్స్‌ కోసం ఎదురు చూశారు. అయినప్పటికీ.. ల్యాండర్ నుంచి ఎలాంటి సమాచారం గానీ.. అంకెలు గానీ గ్రౌండ్ స్టేషన్‌కు రాలేదు. సిగ్నల్స్‌ అందుతాయని ఎంతో నమ్మకంగా ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే చైర్మన్‌ శివన్‌ నేరుగా ఆపరేషన్‌ను తిలకిస్తున్న ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి పరిస్థితి వివరించారు. తలెత్తిన సాంకేతిక సమస్యపై ప్రధానికి తెలియజేశారు.

అంతకు ముందు కూడా విక్రమ్ ల్యాండర్ కొన్ని క్షణాల పాటు తీవ్ర ఉత్కంఠతకు కారణమైంది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో ల్యాండర్ దారి తప్పింది. సుమారు 12 సెకెన్ల పాటు తన నిర్దేశిత మార్గాన్ని వీడి గతి తప్పింది. దీంతో శాస్త్రవేత్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఇస్రో ఛైర్మన్ శివన్ సహా ఏ ఒక్కరు కూడా తమ సీట్లల్లో కూర్చోలేకపోయారు. సరిగ్గా 12 సెకెన్ల తరువాత విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందాయి. గతి తప్పిన ల్యాండర్.. మళ్లీ తన దారిని తానే వెదుక్కుంటూ వచ్చింది. ల్యాండర్ నుంచి సంకేతాలు అందిన వెంటనే శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మరో అయిదు సెకెన్ల తరువాత మళ్లీ విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు స్తంభించిపోయాయి. అదే విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి వచ్చిన చివరి సంకేంతం.

కొన్ని నిమిషాల పాటు సిగ్నల్స్‌ కోసం ఎదురు చూసిన ఇస్రో ఛైర్మన్‌ శివన్‌..చివరకు ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రుడిపైకి మరికొన్ని క్షణాల్లో చేరే సమయంలో ల్యాండర్ నుంచి రావాల్సిన సంకేతాలు నిలిచిపోయాయని ప్రకటించారు. 2.1 కిలో మీటర్ల ఎత్తు వరకు సజావుగా సాగినప్పటికీ చివరి నిమిషంలో సంబంధాలు తెగిపోయాయని ఆయన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story