మెట్రోలో మహిళల ఉచిత ప్రయాణ పథకానికి బ్రేకులు

మెట్రోలో మహిళల ఉచిత ప్రయాణ పథకానికి బ్రేకులు

ఢిల్లీ మెట్రో రైలులో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాధనాన్ని పథకాలకు వెచ్చించే ముందు ఆచీతూచి వ్యవహరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది అత్యున్నత న్యాయస్థానం. మహిళలకు ఉచిత ప్రయాణం పథకంతో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌కి వచ్చే నష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందంది. అసలు మెట్రోలో ఉచిత ప్రయాణం ఎందుకు? ఇలా ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల భవిష్యత్తులో ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ను నష్టాల బాటలో నడిపిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గాలని, ఇలాంటి ఉచిత తాయిలాలను ఉపేక్షించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రజలకు ఉచిత నజరాలు ప్రకటించడానికి బదులు ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించింది. ఢిల్లీ మెట్రో ఆర్థిక నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, దాన్ని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించింది. ఎంసి మెహతా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సందర్భంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో నాలుగో ఫేజ్‌లో భాగంగా త్వరలో చేపట్టే మెట్రో విస్తరణ కోసం భూసేకరణ చేయాలని, దానికి అయ్యే వ్యయంలో సగం కేంద్రం భరించాలని ఆప్‌ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత ప్రయాణాల వల్ల దీర్ఘకాలంలో నష్టాలు తప్పవని, ఇలాంటి హామీలనిస్తూ కేంద్రం ఈ ఖర్చునంతా భరించాలనడం సరికాదని వ్యాఖ్యానించింది.

మహిళలకు భద్రత కల్పించే ప్రయత్నంలో భాగంగా టికెట్ ఛార్జీలు అధికంగా ఉన్న ఢిల్లీ మెట్రో రైలుతో పాటు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులు, మెట్రోకు అనుసంధానంగా సేవలు అందించే క్లస్టర్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే వీలు కల్పిస్తామని జూన్ 3న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే, దీనిపై అప్పట్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2020లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునే అరవింద్ కేజ్రీవాల్ ఈ జిమ్మిక్కులకు తెరతీశారని బీజేపి ఆరోపించింది. ఢిల్లీ ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనను జూలై 27న కేంద్రం సైతం తిరస్కరించింది. మహిళలకు భద్రత కల్పించాలంటే మరో ప్రత్యామ్నాయమార్గాన్ని అన్వేషించాలి కానీ ఇలా ఉచితాలు అందించడం సరికాదని అప్పట్లో కేంద్రం స్పష్టం చేసింది.

తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇతర పథకాలపైనా ప్రభావం పడనుంది. ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో పార్టీలు పోటీలుపడి మరీ ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయి. కేవలం ఓట్ల కోసం ముందుచూపు లేకుండా హామీలు ఇస్తున్నారు. దీని వల్ల ఆర్థికంగా భారం పడుతోంది. మౌలిక సదుపాయాలకు నిధుల కొరత వస్తోంది.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story