కృష్ణా ప్రాజెక్టులకు జల కళ

కృష్ణా ప్రాజెక్టులకు జల కళ

కృష్ణమ్మ బిరబిరలు కొనసాగుతున్నాయి..ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో డ్యామ్‌ల గేట్లు ఎత్తడంతో దిగువకు వరద పోటెత్తుతోంది.. శ్రీశైలం నుంచి దిగువకు కృష్ణమ్మ పరవళ్లు పెడుతోంది.. నాగార్జున సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో ఆ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

అలాగే ఆల్మట్టి నుంచి వరద ప్రవహం కోనసాగుతుండడంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగిపోతోంది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి 2.92 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. జూరాలతో పాటు సుంకేశుల, తుంగభద్ర శ్రీశైలం జలాశయాలకు వరద పోటెత్తుతోంది..

నాగార్జున సాగర్‌కు దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ ఫ్లోగా వస్తోంది. దీంతో సాగర్‌ 8 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులకు చేరింది.సాగర్‌ నుంచి మొత్తం అవుట్‌ ఫ్లో లక్షా 17వేల క్యూసెక్కులుగా నమోదవుతోంది.అటు ప్రకాశం బ్యారేజీకి వరద తాకిడి కొనసాగుతోంది. పులిచింతల నుంచి 36వేల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతోంది. దీంతో కాలువలన్నీ నీటితో కళకళ లాడుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story