రగులుతున్న పల్నాడు

రగులుతున్న పల్నాడు

పల్నాడు రగులుతూనే ఉంది. ఊళ్లను విడిచి వెళ్లిన వారిని తిరిగి ఇళ్లకు తీసుకొచ్చేందుకు పోలీసులు చొరవచూపుతున్నా.. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. బుధవారం నాడు ఛలో ఆత్మకూరు’కు TDP సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా రంగంలోకి దిగారు. బాధిత కుటుంబాలకు నచ్చచెప్పి.. భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చి స్వస్థలాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ బాధితుల కోసం గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన శిబిరానికి వచ్చిన పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు.. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుతో మాట్లాడారు. శిబిరంలో ఉన్న బాధితుల్ని సొంత గ్రామాలకు తీసుకెళ్తామని అధికారులు చెప్పారు.

పోలీసులు ప్రకటనలు ఎంత గొప్పగా ఉన్నా.. తిరిగి గ్రామాలకు వచ్చే విషయంలో బాధితులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఊళ్లను వదిలిపెట్టే పరిస్థితి వచ్చిందంటే తాము ఎంత ఆందోళన చెందామో అర్థం చేసుకోవాలంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి గురజాల ప్రాంతంలో ఘర్షణలు మొదలయ్యాయి. దుర్గి మండలం ఆత్మకూరు గ్రామం నుంచి 70 కుటుంబాలు బయటకు వచ్చేశాయి. కోలగుట్ల, దుర్గి గ్రామాల్లో తలదాచుకున్నారు. దీంతో.. ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని టీడీపీ ప్రకటించింది. వారి కోసం గుంటూరులోని ఓ కల్యాణ మండపంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 11న తానే స్వయంగా ఆ కుటుంబాలను గ్రామానికి తీసుకెళ్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే 'చలో ఆత్మకూరు'కు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగంలో కదలిక వచ్చింది. వైసీపీ బాధిత కుటుంబాలకు భరోసా ఇస్తామంటూ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు వాసులు తమ కష్టాలను పోలీసులకు చెప్పుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story