ఏం నాయనా ఇద్దరు పెళ్లాలు చాల్లేదా.. మూడో సారీ..

ఏం నాయనా ఇద్దరు పెళ్లాలు చాల్లేదా.. మూడో సారీ..
X

ఒక్క భార్యతో కూడా సక్కగ సంసారం చేయడాయే. ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు కావాలట. ముందు చేసుకున్న ఇద్దర్ని వదిలేశాడు. మూడో భార్యకి మూడు ముళ్లు వేయడానికి రెడీ అయ్యాడు. ఉతికి ఆరేస్తే దారికొస్తాడంటూ ఇద్దరు భార్యలు కలిసి అతడు పని చేసే ఆఫీస్‌కి వెళ్లి ఈడ్చి కొట్టారు. కోయంబత్తూరు జిల్లా సూలూరు సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. నెహ్రూనగర్‌కు చెందిన సౌందర రాజన్ కుమారుడు రంగ అరవింద దినేష్ రాశిపురంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2016లో తిరప్పూర్‌కు చెందిన ప్రియదర్శినిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన 15 రోజులకే ఇద్దరిమధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ రాలేదు. భార్య రాకపోవడంతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు దినేష్. మ్యాట్రిమోని ద్వారా అనుప్రియ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఆమెకి కూడా ఇది రెండో వివాహం. ఆమెకి అప్పటికే రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. అనుప్రియతో మొదట్లో సంసారం బాగానే సాగించాడు. కానీ కొద్ది రోజులకు ఆమెతో కూడా గొడవలు. భర్త వేధింపులు భరించలేక అనుప్రియ పుట్టింటికి వెళ్లిపోయింది.

ఖాళీగా ఉంటే తోచనట్టుంది. పెళ్లిళ్లు చేసుకోవడం.. గొడవ పడడం.. ఇదే తంతు.. ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకుందామని మళ్లీ మాట్రిమోని ఆఫీస్ మెట్టెక్కాడు. విషయం తెలుసుకున్న ఇద్దరు భార్యలు.. దినేష్ ఇంటికి వెళ్లి అత్తమామలను నిలదీశారు. ఇంట్లో లేడని చెప్పడంతో అతడు పనిచేసే ఆఫీస్‌కి వెళ్లారు. వాచ్‌మెన్ లోపలికి అనుమతించకపోవడంతో ఇద్దరు భార్యలు కంపెనీ బయటే ఆందోళన చేపట్టారు. అతడు కంపెనీ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇద్దరు భార్యలు దినేష్ మీద విరుచుకుపడి చితకబాదారు. పోలీసులు వచ్చి ఆపేందుకు ప్రయత్నించినా.. అస్సలు ఊరుకునేది లేదంటూ దేహశుద్ది చేశారు. ఎట్టకేలకు పోలీసులు భార్యలనుంచి దినేష్‌ని విడిపించి ముగ్గర్నీ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఇద్దరు భార్యలను మోసం చేసి మూడో వివాహానికి సిద్దమవుతున్నాడని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Also watch :

Next Story

RELATED STORIES