మళ్ళీ నిండిన శ్రీశైలం.. గేట్ల పైనుంచి వరదనీరు.. ఆందోళనలో అధికారులు

మళ్ళీ నిండిన శ్రీశైలం.. గేట్ల పైనుంచి వరదనీరు.. ఆందోళనలో అధికారులు

కృష్ణా బేసిన్‌ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి నాలుగు రోజులుగా వస్తున్న వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల నుంచి 2.45 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33 వేల క్యూసెక్కులు, తుంగభద్ర నది ద్వారా 57 వేల క్యూసెక్కులు కలిపి మొత్తం 3.33 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. ఆరు క్రస్ట్ గేట్లను 23 అడుగుల మేర ఎత్తి 3.19 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా మరో లక్ష క్యూసెక్కులు దిగువకు విడుదలవుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. 884.8 అడుగుల మేర నీరుంది. అయితే, ఎగువ నుంచి వస్తున్న వరద నేడు కొంత తగ్గే ఛాన్స్‌ ఉందని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల పైనుంచి వరద నీరు బయటకు రావడం అధికారులను కలవరానికి గురిచేసింది.. ఎగువ నుంచి వరద ఉధృతంగా వస్తుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం గరిష్టస్థాయికి చేరింది.. ఈ నేపథ్యంలోనే కొన్ని తెరవని గేట్లపైనుంచి వరదనీరు దిగువకు రావడంతో అధికారులు ఆందోళన పడ్డారు. గేట్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడమే కారణంగా చూపుతూ ఆరోపణలు రావడంతో కంగారు పడ్డారు. గేట్లను పరిశీలించారు. మూసివున్న 1, 2, 3, 10 గేట్ల నుంచి నీరు పారడాన్ని గమనించారు. అయితే, జలాశయం నీటిమట్టం గేట్ల ఎత్తుకు సమానంగా ఉండటంతో గాలికి అలలు ఎగసిపడి గేట్ల నుంచి దిగువకు నీరు వస్తోందని గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు.

ఇక నాగార్జున సాగర్‌కు వరద నీటి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది.. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి 4.13 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది.. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్టస్థాయికి చేరుకోవడంతో 24 క్రస్ట్‌ గేట్లను ఎత్తి వచ్చిన నీటినంతా బయటకు, దిగువకు వదిలేస్తున్నారు.. నాగార్జున సాగర్‌ నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 311.14 టీఎంసీల నీరు ఉంది. సాగర్‌ నుంచి వరదనీరు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతోంది.. ఇన్‌ఫ్లో 1.2 లక్షల క్యూసెక్కులు ఉండగా.. 1.4 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజ్‌ నుంచి సముద్రంలోకి వదులుతున్నారు.. బ్యారేజీ 70 గేట్లను ఒక్క అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే, ఎగువ నుంచి వరద ఉధృతి మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో నాలుగు లక్షల క్యూసెక్కులు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story