బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ చరిత్ర ఇది.. దక్కించుకున్నారో..

బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ చరిత్ర ఇది.. దక్కించుకున్నారో..

బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కంటే భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకే బాలాపూర్‌ వినాయకుడికి పూజలు నిర్వహించి విగ్రహాన్ని కదిలించారు. ఊరేగింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

లడ్డూ ప్రసాదం వేలంపాట నిర్వహించనున్నారు. బాలపూర్‌ వినాయకుడు అనగానే వెంటనే లడ్డూ వేలం పాటే గుర్తొస్తుంది. ప్రసాదాన్ని సొంతం చేసుకునేoదుకు భక్తులు పోటీ పడుతుంటారు. లక్షల రూపాయలు పెట్టేందుకు వెనుకాడరు. ఈ లడ్డు బరువు కేవలం 21 కేజీలే. ప్రసాద పరిమాణం చిన్నదే అయినా దాన్ని దక్కించుకుంటే గణపతి కటాక్షం దక్కుతుందని భావిస్తారు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. గత ఏడాది 16.6 లక్షలు పలికిన లడ్డూ ప్రసాదం ఈసారి మరో రికార్డును సృష్టిస్తుందనే అంచనాల్లో ఉన్నారు.

వందల నుంచి మొదలైన వేలంపాట ఇప్పుడు లక్షలకు చేరింది. గత ఏడాది బాలాపూర్‌ మండలానికి చెందిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ గుప్తా 16.6 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అంతకు ముందు ఏడాది నాగం తిరుపతి రెడ్డి 15.6 లక్షలకు వేలంలో లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. 1984 నుంచి బాలాపూర్‌లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ 1994 నుంచే లడ్డూ వేలం ప్రారంభమైంది. లంబోదరుడి చేతిలో పెట్టిన లడ్డూ ప్రసాదాన్ని వేలం వేయడం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. 1994లో కొలను మోహన్ రెడ్డి అనే భక్తుడు మొదటి సారిగా 450 రూపాయలకు లడ్డూని సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఏటా పోటీ పెరుగుతూ వస్తోంది. వేలం పాట వందల్లోంచి లక్షల్లోకి చేరింది. గత ఏడాది బాలాపూర్ మండల ఆర్య వైశ్య కమిటీ తరుపున శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేల రూపాయలకు ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. 1994 వరకు బాలాపూర్ అంటే ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు కానీ ఇప్పుడు మాత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

మొదట లడ్డూ వేలంపాటలో స్థానికులకే అవకాశం కల్పించిన నిర్వాహకులు తర్వాత బయటి వారిని కూడా అనుమతిస్తున్నారు. అంతేకాదు, లడ్డూ వేలం ద్వారా ఇప్పటి వరకు వచ్చిన 46 లక్షల రూపాయల్ని దేవాలయం, గ్రామాభివృద్ధికి ఉపయోగించారు. పలు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేపట్టారు. మొత్తంగా ఈసారి బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ ప్రసాదం మరో కొత్త రికార్డు సృష్టించనుందా.. ఈ విషయం మరికొద్ది గంటల్లోనే తేలనుంది.

Tags

Read MoreRead Less
Next Story