అందులో ఐదు రూపాయలు కూడా ఆదా చేయలేరు : సుజనా చౌదరి

వందరోజుల వైసీపీ పాలనపై మండిపడ్డారు బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి. రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయంపై గవర్నర్‌ను కలసిన ఆయన జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై వైసీపీ ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదంటూ మండిపడ్డారు. ఈ వందరోజుల పాలనలో ప్రత్యర్ధులపై కక్ష తీర్చుకుంటున్నట్లుగా ఉందన్నారు. పోలవరం విషయంలోనూ కేంద్రం వారించినా.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల ఐదు రూపాయలు కూడా ఆదా చేయలేరన్నారు సుజనా చౌదరి.
కాపర్ డ్యాం పూర్తి చేసి ఉంటే గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశం ఉండేదన్నారు సుజనాచౌదరి. పోలవరం ప్రాజెక్టు ఆలస్యమయ్యే కొద్ది ఏటా 20 వేల కోట్ల వ్యవసాయ ఉత్పాదకత నష్టపోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ముంపులేని గ్రామాలు సైతం ముంపునకు గురయ్యాయంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచన లేకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు.
అమరావతిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదంటూ ఫైర్ అయ్యారు సుజనాచౌదరి. అందుకే రాజధాని రైతులతో కలసి గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టాలని కోరారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు సుజనాచౌదరి. రాజధాని, పోలవరంపై గందరగోళంలో ఉన్న ప్రభుత్వం.. శాంతి భద్రతల్ని సైతం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తీరు ఇలాగే ఉంటే కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందన్నారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com