ఫలించిన మంతనాలు.. టీఆర్ఎస్ లోనే ఆ ఎమ్మెల్యే..

ఫలించిన మంతనాలు.. టీఆర్ఎస్ లోనే ఆ ఎమ్మెల్యే..

బోధన్ ఎమ్మెల్యే షకీల్ రగిల్చిన అసంతృప్తి జ్వాల కొద్ది గంటల్లోనే చల్లారిపోయింది. పార్టీ మార్పు ఖాయమని అనుకుంటున్న సమయంలో టీఆర్ఎస్ మంతనాలు ఫలించాయి. హైడ్రామాకు తెరదించుతూ బతికున్నంత కాలం టీఆర్ఎస్ లోనే ఉంటా అంటూ పార్టీ భక్తి, కేసీఆర్ తన పొలిటిక్ గాడ్ ఫాదర్ ఆంటూ స్వామి భక్తిని చాటుకున్నారు షకీల్.

మాజీ మంత్రులు నాయిని, జోగు రామన్న, జూపల్లి అసంతృప్తి రాగం అందుకోగానే మంతనాలు జరిపిన టీఆర్ఎస్ అందర్ని శాంతింపచేసింది. ఆ వేడి చల్లారకముందే టీఆర్ఎస్ లోని ఏకైక మైనారిటీ ఎమ్మెల్యే షకీల్ జంపింగ్ బాంబ్ పేల్చారు. సోమవారం రోజున ఆయన బీజేపీలో చేరటం దాదాపుగా ఖాయమైపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ సమయంలో గులాబీ లీడర్లు ఆయన్ను బుజ్జగించారు. పార్టీ కోసం కష్టపడిన అందరికీ తగిన సమయంలో తగిన గుర్తింపు ఉంటుందని ఊరడించారు. దీంతో మెత్తబడిన షకీల్ టీఆర్ఎస్ వదిలి వెళ్లేది లేదని క్లారిటీ ఇచ్చారు.

అంతకుముందు బీజేపీ ఎంపీ అర్వింద్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు షకీల్. తాజా రాజకీయ పరిణామాలపై లోతుగా చర్చించినట్టు అర్వింద్‌ అన్నారు. అయితే.. ఇటీవల జరిగిన కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో షకీల్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డిని బోధన్‌లో తాను రెండుసార్లు ఓడించినా.. టీఆర్ఎస్‌లో తనకు సరైన ప్రాధాన్యం లేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. మంత్రి పదవి వస్తుందని ఆశించానని టీవీ5తో చెప్పారు షకీల్. బీజేపీలో చేరబోతున్నారా అంటే.. చూద్దాం.. ఏం జరుగుతుందో అని సమాధానం ఇచ్చారాయన. కేసీఆర్‌ దయతో ఎమ్మెల్యేగా గెలిచానంటున్న షకీల్‌.. అవసరమైతే రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు.

టీడీపీ నుంచి ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన షకీల్‌.. తర్వాత కారెక్కారు. 2009లో టీఆర్‌ఎస్ తరఫున తొలిసారి బోధన్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018లో వరుస విజయాలు సాధించారు. మైనార్టీ కోటాలో మంత్రి అవుతానని ఆయన ఆశించినా.. కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కలేదు. అందుకే.. కాషాయం వైపు ఆకర్షితులయ్యారని కొందరు చెప్తున్నా.. ఆయనపై గతంలో చాలా కేసులు ఉన్నాయని.. వాటి భయంతోనే పక్కచూపులు చూస్తున్నారని మరికొందరి అంచనా. మనుషుల అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్‌ కేసులు షకీల్‌పై ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు షకీల్ చూస్తున్నారని... ఆ విషయంపైనా కమలనాథులతో చర్చలు జరిగాయనే ప్రచారం ఉంది. అయితే.. ఈ ప్రచారాల మధ్య కొనసాగిన సందిగ్థతకు తెరదించుతూ తాను టీఆర్ఎస్ లోనే ఉంటానంటూ స్పష్టం చేశారు షకీల్.

Tags

Read MoreRead Less
Next Story