నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి : ముఖ్యమంత్రి జగన్‌

నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి : ముఖ్యమంత్రి జగన్‌

వరద జలాలను ఒడిసిపట్టాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. వరద నీరంతా సముద్రం పాలు కాకముందే కృష్ణా నదిపై ఆధారపడిన ప్రాజెక్టులన్నీ నిండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. 120 రోజులు వరద వస్తుందనే లెక్కలను సవరించాలని అధికారులకు సూచించారు సీఎం జగన్‌. ఈ సీజన్‌లో కృష్ణా నదికి రెండుసార్లు వరదలు వచ్చాయన్నారు.. ఈ నేపథ్యంలో 30 రోజులు మాత్రమే వరద వస్తుందని అంచనా వేసి ఆ మేరకు నీటిని తరలించడానికి చర్యలు చేపట్టాలన్నారు.

ఇక నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్‌. ఇప్పటి వరకూ జరిగిన సాగునీటి ప్రాజెక్టుల పనుల గురించి ఇరిగేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టు పనుల్లో రివర్స్‌ టెండరింగ్ విధానం పాటించాలన్నారు. నాలుగేళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేసేలా జిల్లాల వారీగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అలాగే పొరుగు రాష్ట్రమైన ఒడిశాతో అభ్యంతరాలున్న ప్రాజెక్టులపై నోట్‌ ప్రిపేర్‌ చేయాలన్నారు. సదరు సమస్యల పరిష్కారానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలకు సన్నాహాలు చేయాలన్నారు. అలాగే పల్నాడును సస్యశ్యామలం చేయాలని, దీని కోసం పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రతి రూపాయిని సద్వినియోగం చేయాలని అధికారులకు సూచించారు.

ఇక సహాయ పునరావాస పనుల్లో ఉదారంగా ఉండాలని.. ముంపు ప్రాంతాల బాధితుల పట్ల మానవతా దృక్పథంలో వ్యవహరించాలని అధికారులకు సీఎం సూచించారు. జిల్లాల మధ్య నీళ్ల కోసం కొట్లాటలు ఉండకూడదన్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కలుషిత నీటిని తాగి ప్రజలు తీవ్ర రోగాల బారిన పడుతున్నారన్న సీఎం.. అవసరమైన చోట మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు సహాయ పునరావాస పనులపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. దీని కోసమే ప్రత్యేక అధికారిని నియమించామని జగన్‌ తెలిపారు. ఇటీవల వరదల్లో బాధితులైన వారికి ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కల్పనలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాగే చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపైనా జగన్‌ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 15 నుంచి అమలు చేయనున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని నిజమైన రైతులందరికీ అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన జగన్‌.. లబ్ధిదారుల గుర్తింపునకు ఈ నెల 18 నుంచి 25 వరకు సర్వే చేయలని సూచించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని వెబ్‌లాండ్‌ జాబితాను గ్రామ పంచాయితీల వారీగా పరిశీలించి అందులో ఉన్న వారు నిజమైన రైతులో కాదో గుర్తించి ఈ పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించాలన్నారు. గతంలో మాదిరిగా వ్యవసాయం చేయని వారికి, విదేశాల్లో ఉంటూ సాగు చేయని భూ యజమానులకు, వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్, చేపల చెరువులుగా మార్పిడి చేసిన వారికి రైతు భరోసా కింద లబ్ధి కలగకూడదని జగన్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story