డీజీపీ వద్దకు టీడీపీ ప్రతినిధుల బృందం..

డీజీపీ వద్దకు టీడీపీ ప్రతినిధుల బృందం..

చలో ఆత్మకూరుతో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. వైసీపీ దాడి బాధితుల శిబిరాన్ని విజయవంతంగా నడిపిన కమిటీకి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. వైసీపీ అరాచకాలపై టీడీపీ ప్రతినిధుల బృందం ప్రచురించిన రెండు పుస్తకాలను నేడు డీజీపీకి అందించనున్నట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ బాధితులకు అండగా నిలవాలని పార్టీ నేతలకు సూచించారు. అరాచకాలు, అన్యాయాలపై ప్రైవేటు కేసులు వేయాలన్నారు. హింస, విధ్వంసాలపై గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలని.. హెచ్‌ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లాలన్నారు.. టీడీపీ ఎంపీలతో వెళ్లి కేంద్రహోంమంత్రికి ఫిర్యాదు చేయాలని సీనియర్‌ నేతలకు చంద్రబాబు సూచించారు. గత సీఎంలకు ఫ్యాక్షన్‌ నేపథ్యంగా ఉన్నా ఆ గొడవలను వారి జిల్లాలకే పరిమితం చేశారని.. పరిటాల రవీంద్ర విషయంలో వైఎస్‌ జోక్యం ఉన్నా అది సీమకే పరిమితం అయిందని గుర్తు చేశారు.. కానీ, జగన్‌ ఫ్యాక్షన్‌ సంస్కృతిని రాష్ట్రమంతటా విస్తరింపజేస్తున్నారని చంద్రబాబు తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.

హాజరుకాలేనని కోర్టులను మినహాయింపు కోరే వ్యక్తి నోటి నుంచి నీతి వాక్యాలు వినాల్సిరావడం కంటే హేయం మరోటి లేదన్నారు. రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తితే ఏ సీఎం అయినా స్పందించకుండా ఉంటారా అని ప్రశ్నించారు. పీపీఏలపై కేంద్రం, కోర్టులు, విదేశాల హెచ్చరికలకూ సీఎం స్పందించడం లేదని.. పోలవరం ప్రాజెక్టుపైనా సీఎం స్పందించకపోవడం అరాచకానికి పరాకాష్ట అని అన్నారు. చలో ఆత్మకూరు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో 7,165 మంది టీడీపీ నాయకులు పాల్గొన్నారని.. వీరిలో 1,780 మంది కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. మరో 75 మందిని గృహ నిర్బంధం చేశారని ఫైరయ్యారు. ఇవికాకుండా మరో 32మందిపై బైండోవర్ కేసులు పెట్టినట్లు సీనియర్‌ నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్లారు.

మరోవైపు పల్నాడు ప్రాంతంలోని ఆత్మకూరు బాధితులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. మాజీ సర్పంచ్‌ ఏసోబుతో పాటు పలువురికి ఫోన్ చేసిన చంద్రబాబు.. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఊళ్లో అందరూ ఎలా ఉన్నారని వాకబు చేశారు. మీరు ఇంట్లోనే ఉన్నారా అని చంద్రబాబు వారిని ప్రశ్నించారు. తమ ఇళ్లు బాగు చేసుకుంటున్నామని బాధితులు ఆయనకు సమాధానమిచ్చారు. పొలాల్లోకి వెళ్తున్నారా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే తాను ఆత్మకూరుకు వస్తానని.. బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అటు తమకు అండగా నిలబడినందుకు చంద్రబాబుకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story