టీవీ5 ప్రసారాలను పునరుద్దరించాలని ప్రజాసంఘాల డిమాండ్

టీవీ5 ప్రసారాలను పునరుద్దరించాలని  ప్రజాసంఘాల డిమాండ్

విజయవాడలో టీవీ5 ప్రసారాలు పునరుద్దరించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే పలు ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టగా.. తాజాగా తెలుగు యువత ప్రతినిధులు పలు కేబుల్ సంస్థల యాజమాన్యాల్ని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. D-ఛానెల్ ఎండీ కడియాల బుచ్చిబాబు, సీ ఛానెల్ ఎండీ రమేష్‌ను కలిసి టీవీ5 ప్రసారాలు యధావిధిగా కొనసాగించాలని కోరారు. సిటీ కేబుల్ కార్యాలయానికి వెళ్లి అక్కడ కూడా వినతిపత్రం ఇచ్చారు. మీడియా స్వేచ్ఛను కాపాడాలంటూ తెలుగు యువత కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభుత్వం కొన్ని ఛానెళ్లపై కక్ష కట్టినట్టు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. మీడియాపై నిషేధాన్ని అంతా ఖండించాలని, ప్రజాస్వామ్యవాదులంతా ఆందోళనల్లో కలిసి రావాలని కోరారు. ప్రభుత్వం నిలిపి వేసిన ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ ఆందోళనలో మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, మాజీ కార్పొరేటర్ సుబ్బారావు సహా పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోనూ టీవీ5 ప్రసారాలు పునరుద్ధరించాలంటూ ఆందోళనలు చేపట్టారు. పాలకోడేరు మండలం విసాకోడేరులో ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. గ్రామంలోని కొందరు టీవీ5 అభిమానులు ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్లపై టీవీలను ధ్వంసం చేశారు. టీవీ5 ప్రసారాలు తిరిగి ఇవ్వకపోతే.. తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనట్టుగా నిరంకుశత్వంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు. జగన్ సర్కారు పాలన హిట్లర్ పాలనకన్నా దారుణంగా ఉందని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story