నేను ఎవరికోసం బతకాలి? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్లుంటే బావుండు

నేను ఎవరికోసం బతకాలి?  ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్లుంటే బావుండు

ఉప్పెన లేదు. ప్రళయం రాలేదు. కానీ, కళ్ల ముందే మహా విషాదం జరిగిపోయింది. అప్పటివరకు సంతోషంగా గడిచిన క్షణాలు యమగడియలుగా మారిపోయాయి. ప్రకృతి రమణీయతతో కనువిందు చేసిన గోదారి ప్రయాణం మృత్యువై వెంబడించింది. కట్టుకున్న భర్త, కన్న కూతురు, తోడొచ్చిన స్నేహితులు ఇలా ప్రాణబంధాలన్నీ కళ్ల ముందే కొట్టుకుపోయాయి. నీటిని చూస్తేనే హడలిపోయేంతగా విషాదాన్ని మిగిల్చాయి.

పాపికొండల ప్రయాణం. ప్రకృతి సోయగం. అదే ప్రకృతి అందాలు ప్రయాణికుల పాలిట వికృతిగా మారింది. 5 లక్షల క్యూసెక్కుల ఉద్ధృతితో ప్రవహిస్తున్న గోదారమ్మ కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, వరంగల్, అనకాపల్లి ఇలా అంతా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అంతా ఒక్కటిగా ప్రయాణం సాగించారు. ఆ బోటు ప్రయాణం కొందరకి చివరి మజిలీ అయింది. కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది.

తిరుపతికి చెందిన మధులత, సుబ్రహ్మణ్యం భార్యాభర్తలు . సుబ్రహ్మణ్యం తండ్రి ఇటీవలె చనిపోయాడు. తండ్రి చితాభస్మాన్ని గోదారిలో కలిపేందుకు భార్య, కూతురు హాసినితో కలిసి పాపికొండలకు బయల్దేరాడతను. పడవ మునిగిపోవటంతో భార్యను తిరగబడిన బోటు ఎక్కించి, కూతుర్ని తల్లికి అందించి తాను గోదారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పన్నెండేళ్ల కూతురు హాసిని తల్లి కాళ్లు పట్టుకొని ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నించింది. కానీ, నీటి ప్రవాహానికి ఆ చిన్నారి తాళలేకపోయింది. ఆమె కూడా కొట్టుకుపోయింది. అప్పటివరకు కుటుంబంతో సంతోషంగా గడిపిన మధులత కళ్ల ముందే భర్త, కూతుర్ని కొల్పోయి ఒంటరైపోయింది. ఇక నేను ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్లుంటే ఎంత బావుండేదంటూ మధులత గుండెలవిసేలా ఏడ్చింది.

ఇక ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రమ్య, లక్ష్మణ్ విద్యుత్ శాఖలో ఏఈలుగా ఉద్యోగం సాధించారు. సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు మిగిలిన స్నేహితులతో కలిసి పాపికొండల టూర్ కి వెళ్లారు. కచ్చులూరు ప్రమాదంలో ఇద్దరు యువ ఇంజనీర్లు గల్లంతయ్యారు. దీంతో వీరి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. రమ్య , లక్ష్మణ్‌ సేఫ్‌గా రావాలని పూజలు చేస్తున్నాయి ఈ రెండు కుటుంబాలు.

వరంగల్ కు చెందిన 14 మంది ఈ మధ్యే తమ కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం తరపున యాత్రకు వెళ్లారు. జట్టుకట్టి సంఘంగా ఏర్పడిన వారిని కచ్చులూరు విషాదం చెల్లాచెదురు చేసింది. ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన ఆ తొమ్మిది మంది గల్లంతయ్యారు. చివరకు ఆ ప్రయాణం వారి కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా ఉండాల్సిన విహార యాత్ర విషాదాంతమైంది. దాదాపు 40కి పైగా కుటుంబాల్లో చీకటిని నింపింది.

Tags

Read MoreRead Less
Next Story