కోడెల శివప్రసాదరావు ప్రస్థానం

కోడెల శివప్రసాదరావు  ప్రస్థానం

గుంటూరు జిల్లా, నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో 1947 మే 2వ తేదీన కోడెల శివప్రసాదరావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సంజీవయ్య, లక్ష్మీనర్సమ్మ. వారిది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆయన 5వ తరగతి వరకూ స్వగ్రామంలోనే చదివారు. కొద్దిరోజులు సిరిపురంలో, ఆ తర్వాత నర్సరావుపేటలో పదవ తరగతి పూర్తి చేసిన ఆయన విజయవాడ లయోలా కళాశాల పీయూసీ చదివారు. చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది. ఆ విషాదమే డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్ధిక స్తోమత అంతంతమాత్రమే ఉన్న ఆరోజుల్లో వైద్యవిద్య ఆలోచనే ఓ సాహసం. తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించడానికి ముందడుగు వేసారు. కానీ ఆ మార్కులకు మెడికల్ సీటు రాలేదు. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు. రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఇక వారణాసిలో ఎం.ఎస్ చదివారు.

సత్తెనపల్లిలో రావెల వెంకట్రావు అనే వైద్యుడి దగ్గర కొంతకాలం అప్రెంటీస్ గా ప్రాక్టీసు మొదలుపెట్టారు. ఆయన దగ్గరకు గ్రామీణులే అధికంగా వచ్చేవారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన కోడెల శివప్రసాదరావు తను చదివిన వైద్యవిద్యతో గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో తన స్వంత ఆసుపత్రిని గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థాపించారు. వాళ్ళ అభిమానంతో పల్నాడు ప్రాంతంలో మంచి డాక్టరుగా పేరు తెచ్చుకున్నారు. అనతికాలంలోనే ఆసుపత్రికి వచ్చిన రోగులపట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపటమే కాకుండా ఉత్తమ ఔషధాలు అందిస్తూ, నమ్మకమైన సేవలందిస్తూ, మంచి సర్జన్‌గా పేరుగావించి, మనస్సున్న మారాజుగా మన్ననలు పొంది, వృత్తి ధర్మానికి న్యాయం చేస్తూ.. డాక్టర్ కోడెల గా గుర్తింపు పొందారు.

Tags

Read MoreRead Less
Next Story