అంత సీన్ లేదు.. వాస్తవాన్ని ఒప్పుకున్న..

అంత  సీన్ లేదు.. వాస్తవాన్ని ఒప్పుకున్న..

ఇక దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా పాకిస్తాన్‌ తానే నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తూ, ఇతరులపై ఆరోపణలు చేస్తోంది. సరిహద్దుల్లో పాక్ సైన్యం వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడాలని, రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని భారత సైన్యం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాక్ సైన్యం పట్టించుకోవడం లేదు. పైగా, పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కాల్పులకు తెగబడుతోంది. ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తూ సామాన్య పౌరులను కూడా బలి తీసుకుంటోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 2 వేల సార్లకు పైగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో 21 మంది పౌరులు మృతి చెందారు.

జమ్మూ కశ్మీర్ విభజన, ఆర్టికల్-370 రద్దుతో పాక్ సైన్యానికి పిచ్చి పట్టినట్లైంది. పట్టలేని ఆక్రోశంతో ఎల్వోసీ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతోంది. బోర్డర్ యాక్షన్ టీం, రేంజర్లు మోర్టార్ షెల్స్‌ను ప్రయోగిస్తూ గ్రామాలపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులను భారత సైన్యం సమర్దవంతంగా తిప్పికొడుతోంది. భారత ఆర్మీ ధాటికి తట్టుకోలేక పాక్ సైనికులు వెనక్కి తగ్గుతున్నారు.

ఈ నేపథ్యంలోనే భారత ఆర్మీ స్థావరాలు, గ్రామాలు లక్ష్యంగా మరోసారి కాల్పులకు తెగబడింది పాక్‌. ఈ క్రమంలో పూంఛ్ పరిధిలోని పాఠశాలలో 20 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. బుల్లెట్లు దూసుకొస్తుండడంతో వారంతా ప్రాణభయంతో వణికి పోయారు. విషయం తెలుసుకున్న సైనికులు, వెంటనే రంగంలోకి దిగారు. చిన్నారులకు రక్షణ కవచం లా నిలిచి, పాక్ సైనికులపై ఎదురుదాడి చేశారు. భారత సైన్యం కాల్పులతో పాక్ సైనికులు తోకముడిచారు. అనంతరం జవాన్లు, చిన్నారులను మైన్‌ప్రూఫ్ వాహనంలో ఎక్కించి ఇళ్ల వద్ద సురక్షితంగా విడిచి పెట్టారు.

మరోవైపు యుద్ధం యుద్ధం అంటూ ప్రగల్భాలు పలికిన ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు మాకంత సీన్ లేదంటూ వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు. భారత్‌తో ప్రత్యక్ష యుద్ధంలో పాకిస్థాన్ గెలవలేదని ఇమ్రాన్ పేర్కొన్నారు. భారత్ ముందు తమ సామర్థ్యం సరిపోదని అంగీకరించారు. ఇరు దేశాల మధ్య సంప్రదాయ యుద్ధమే వస్తే పాకిస్థాన్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే అణ్వస్త్రాలతో ముగుస్తుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story