త్వరలోనే ఆ సినిమా చూపిస్తాం : మంత్రి కేటీఆర్

త్వరలోనే ఆ సినిమా చూపిస్తాం : మంత్రి కేటీఆర్

అసెంబ్లీలో పద్దులపై వాడివేడిగా చర్చ జరిగింది. పాలన వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవడంతో పట్టణీకరణ పెరుగుతోందన్నారు మంత్రి కేటీఆర్. శాసన సభలో చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తామన్నారాయన. స్వచ్ఛభారత్‌లో భాగంగా రాష్ట్రంలో వందశాతం ఓడీఎఫ్‌లు సాధించుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రభుత్వ తీరును విమర్శించారు. హైదరాబాద్‌ను డల్లాస్‌ చేస్తామని, మూసినదిని క్లీన్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రజలకు 70 mm సినిమా చూపించారని ఎద్దేవా చేశారు. ఇలా ఎన్ని రోజులు సినిమా చూడాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఆరోపణలకు దీటుగా కౌంటర్‌ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌. ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమేనన్న ఆయన.. సినిమా ముందు ఉందని త్వరలోనే ఆ సినిమా చూపిస్తామన్నారు. ఇది సూపర్‌ హిట్‌ అవుతుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే నల్లగొండ జిల్లాలో ప్రజలు విషతుల్యమైన నీరు తాగి ఫ్లోరోసిస్‌ వ్యాధిన పడ్డారని గుర్తు చేశారు.

అంతకు ముందు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందంటూ విమర్శించారు రాజగోపాల్‌రెడ్డి. మంత్రి తలసానిని విమర్శిస్తూ.. పార్టీలు మారి మంత్రి పదవులు పొందారంటూ ఎద్దేవా చేశారు రాజగోపాల్‌రెడ్డి

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. తాను టీఆర్‌ఎస్‌ గుర్తుతోనే గెలిచానని గుర్తు చేశారు. రాజగోపాల్‌రెడ్డి.. ఎప్పుడు పార్టీ మారుతారో తెలియదన్నారు. ఇద్దరు కోమటిరెడ్డి సోదరులు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలీదని విమర్శించారు.

మరోవైపు మంత్రి హరీష్‌ రావు సైతం కాంగ్రెస్‌ విమర్శల్ని తప్పుబట్టారు. తమది ప్రజా సంక్షేమ ప్రభుత్వమన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనన్నారు. చెరువుల్ని మరమ్మతు చేసేందుకు మిషన్‌ కాకతీయ అమలు చేస్తున్నామన్నారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే 5 వేల చెరువుల్ని పునరుద్ధరించినట్లు తెలిపారు మంత్రి హరీష్‌.

ఇక... విద్యుత్‌ కొనుగోలుపై అసెంబ్లీలో సమాధానమిచ్చారు మంత్రి జగీదీష్‌రెడ్డి. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ విద్యుత్‌రంగ సంస్థ నుంచే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారాయన. తక్కువ ధరకు వస్తుండటం వల్లే అక్కడి నుంచి తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు.

ఈ నెల 25వ తేదీ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని ప్రకటించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. కుల వృత్తులకు చేయుత ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన.. గొల్ల, కురుమలకు 75శాతం రాయితీపై గొర్రెలనుపంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story