ఉత్తమ్‌పై కుంతియాకు ఫిర్యాదు చేసిన రేవంత్‌ రెడ్డి

ఉత్తమ్‌పై కుంతియాకు ఫిర్యాదు చేసిన రేవంత్‌ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గవిబేధాలు భగ్గుమన్నాయి. ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతున్నాయంటూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను కలిసి ఫిర్యాదు చేశారు. హుజూర్‌నగర్‌లో అభ్యర్థి పేరుపై పార్టీలో ఇంతవరకూ చర్చే జరగలేదని.. అలాంటప్పుడు ఉత్తమ్‌ ఏకపక్షంగా పద్మావతి పేరును ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు రేవంత్‌ రెడ్డి.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థిగా స్థానిక నేత అయిన చామల కిరణ్‌రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నానని రేవంత్‌ చెబుతున్నారు. పద్మావతి పేరు ప్రకటనపై ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలను వివరణ తీసుకోవాలని కుంతియాను రేవంత్‌ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. మంగళవారం గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు సీఎల్పీ సభ్యుడినైన తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు రేవంత్‌ రెడ్డి. సీఎల్పీలో ఎంపీ కూడా సభ్యుడేనని గుర్తు చేశారు.

అటు కాంగ్రెస్‌లో యురేనియం ఉద్యమం కూడా చిచ్చు రాజేసింది. యురేనియంపై జనసేన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఉత్తమ్‌, రేవంత్‌, వీహెచ్‌లు పాల్గొనడాన్ని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ తప్పు పట్టారు. దీనిపై రేవంత్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ తో సంపత్‌ ఫొటో దిగకుంటే బాధ్యత నాది కాదంటూ సటైర్‌ వేశారు. ఉత్తమ్‌, వీహెచ్‌ల వెంట తాను వెళ్లానని, తమను ప్రశ్నించిన సంపత్‌, వంశీచంద్‌రెడ్డి అందరి కంటే ముందే ఆ కార్యక్రమానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. యురేనియంపై అమెరికాలో మీటింగ్‌ పెట్టినా తాను వెళతానన్నారు రేవంత్‌ రెడ్డి.

కొంతకాలంగా నాయకత్వ మార్పుపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్రూపురాజకీయాలు ఒక్కసారిగా హస్తం పార్టీలో అలజడి రేపాయి. ఉత్తమ్‌ వర్సెస్‌ రేవంత్‌ రెడ్డి వార్‌ ఎక్కడికి దారి తీస్తుందోనని నేతలు కలవరపడుతున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story