కరోడ్ పతిలో 'కోటి' రూపాయలు గెలుచుకున్న ఓ వంటమనిషి..

కరోడ్ పతిలో కోటి రూపాయలు గెలుచుకున్న ఓ వంటమనిషి..
X

ఓ వంట మనిషి కమ్మగా వండి పెడుతుంది కానీ కరోడ్ పతిలో కోటి రూపాయలు గెలవడం ఏమిటి. నిజంగా అద్భుతం ఏదో జరిగే ఉంటుంది. రేయింబవళ్లు పుస్తకాలు చదివేసి, చించేసే వాళ్లకే సాధ్యం కాని వ్యవహారం.. అంత ఈజీగా ఆమెకెలా వచ్చాయి కోటి. ఆ వార్తే అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచింది. దీక్ష, పట్టుదల ఇలాంటి పదాలేవీ ఆమె వంట బట్టించుకోలేదు. వంట పని చేసుకుంటూ, ప్రభుత్వ పాఠశాలలో ఆయాగా విధులు నిర్వర్తిస్తూ టీవీలో వచ్చే వార్తల్ని వింటూ, పేపర్ చదువుతూ కరెంట్ ఎపైర్స్‌ని కంఠతా పట్టేసింది. ఆడుతూ, పాడుతూ పని చేసుకోవచ్చని తెలుసుగానీ, అలవోకగా కరోడ్‌పతిలో కోటి రూపాయలు గెలవడం అంటే మాటలు కాదు. ఆమె గురించి మాట్లాడడానికి మాటలూ చాలవు.

మహారాష్ట్రకు చెందిన బబితా తడే.. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ చదువుకోలేదు. తనతో పాటు ఉన్న ఎనిమిది మంది పిల్లల ఆలనా పాలనా చూసుకోవడమే సరిపోయేది తల్లికి. తండ్రి మరణించే నాటికి బీఏ పూర్తి చేసిన బబితకు పెళ్లయింది. ఇంటర్ చదువుకున్న భర్త ప్రభుత్వ పాఠశాలలో ఫ్యూన్‌గా పనిచేస్తున్నాడు. మొదటి నుంచి ఏదో ఒక పని చేయాలని ఎవరి మీదా ఆధారపడకుండా బతకాలని కలలు కంటూ ఉండేది బబిత. అదే ఆలోచనతో పిల్లలు కాస్త పెరిగి పెద్దవాళ్లయ్యాక భర్త పని చేసే స్కూలుకు వెళ్లి టీచర్ ఉద్యోగం ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగింది. టీచర్ పోస్ట్ లేదు.. పిల్లలకు మధ్యాహ్నం పూట వంట వండి పెట్టే ఆయమ్మ పోస్టు ఉంది ఇస్తాం.. చేస్తావా అన్నారు. దానికి ముందు కొంత తటపటాయించినా నాన్న అన్నమాటలు గుర్తొచ్చాయి.. పని ఎంత చిన్నదైనా చేయడానికి సిగ్గుపడకూడదు.. కష్టపడితే గుర్తింపు అదే వస్తుంది అని అనేవారు ఎప్పుడూ. వాటినే స్ఫూర్తిగా తీసుకుని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓకే అనేసింది.

పదిహేనేళ్ల క్రితం ఆ స్కూల్లో జాయిన్ అయిన బబిత ఉన్న 30 మంది పిల్లలకి వండి పెట్టేది. ఇప్పుడు ఆ స్కూలు విద్యార్థుల సంఖ్య 450 మంది. కమ్మగా వండి పెట్టే బబిత కిచిడీ అంటే పిల్లలకు చాలా ఇష్టం. స్కూల్లో పేద విద్యార్థులే ఎక్కువగా ఉండడంతో వీలైనంత వరకు మానేయకుండా స్కూలుకు వెళ్లేది బబిత. స్కూల్లో ఉన్నంత సేపు వాళ్లకు వండి పెట్టడం వరకే ఆలోచన.. ఆ తరువాత ఇంటికి వచ్చాక పిల్లల ఆలనా పాలనా.. మధ్యలో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి. అదీ ఇరుగు పొరుగుతో కబుర్లు, కాలక్షేపం వంటివి కాకుండా చరిత్రకు సంబంధించిన విషయాలు, రాజకీయ విశ్లేషణలు, ప్రపంచంలో జరిగే పలు విషయాల పట్ల ఆసక్తిని పెంపొందించుకునేది. ఈ క్రమంలోనే కౌన్ బనేగా కరోడ్ పతిని గురించి వినడం, చూడడం చేసేది. అందులో అడిగే ప్రశ్నలన్నింటికీ తానూ సమాధానం చెప్పగలనన్న ధైర్యాన్ని, నాలెడ్జ్‌ని సంపాదించుకుంది.

అవకాశం కోసం ప్రయత్నించగా ప్రక్రియలన్నీ పూర్తయి ఇంటర్వ్యూకు రమ్మంటూ పిలుపొచ్చింది. ఆ తరువాత మరో ఇంటర్వ్యూని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడంతో ప్రోగ్రాంకి ఎంపికైనట్లు చెబుతూ విమాన టికెట్లు పంపించారు బబితకు. ఓడిపోయినా సరే.. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో షోలో పాల్గొంది. వరుసగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ వస్తోంది. మధ్యలో అమితాబ్ జీ.. చెప్పిన సమాధానం కరెక్టో కాదో మరోసారి ఆలోచించుకోండి అని కన్ఫ్యూజ్ చేసినా కాన్ఫిడెన్స్‌తో చెప్పేసరికి ఆయన కూడ ఆశ్చర్యపోయారు. అన్నింటినీ దాటుకుని పదిహేనో ప్రశ్నకు వచ్చేసరికి సమాధానం తెలిసినా చెప్పేలోగా అమితాబ్ ఎంతో కంగారు పెట్టారని.. అయినా కొన్ని సెకన్ల విరామంలోనే సమాధానం చెప్పినా మరోసారి ఆలోచించుకోండి అని భయపెట్టారు.

చివరకు మీ సమాధానం కరెక్ట్ అని అనేసరికి నోట మాటరాలేదు. నేనేనా కోటి రూపాయలు గెలుచుకుంది అనే సంతోషం కంటే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను అన్న ఆనందం.. అమితాబ్‌ లాంటి నటుడి ముందు కూర్చునే అవకాశం దక్కడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని బబిత ఆనందంగా చెబుతోంది. తండ్రి శివభక్తుడు.. ఆయనకు శివాలయం నిర్మించాలనే కోరిక ఉండేది. ఈ డబ్బుతో శివాలయం కట్టించడానికి కొంత ఖర్చు చేస్తానని చెబుతోంది. అలాగే డిగ్రీ చదువుతున్న తన కూతురు, పదవతరగతి చదువుతున్న తన కొడుకు భవిష్యత్ కోసం కొంత ఖర్చు చేస్తానని తెలిపింది. అయితే చేస్తున్న ఆయమ్మ పనిని మాత్రం మానేయను.. అదే నన్ను ఇక్కడి వరకు తీసుకు వచ్చింది అని ఆనందంగా చెబుతోంది బబిత.

Next Story

RELATED STORIES